Man Found Dead In Laws House :అత్తగారింటికి వెళ్లిన అల్లుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ మండిలోని సర్కాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్తింటి వారే తన కుమారుడిని హత్య చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ జరిగింది
బడాల్ సర్కాఘాట్ ప్రాంతానికి చెందిన నవీన్‌కు 2015లో ఓ యువతితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే, 2022 నవంబర్‌లో నవీన్.. ఉద్యోగం కోసం బదీ నల్గఢ్కు వెళ్లగా.. కూతురిని తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉంటుంది. అయితే, నవంబర్ 11న నవీన్ అత్తగారింటికి వెళ్లగా.. అక్కడ భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఆ తర్వాత నవీన్ కాలిన గాయాలతో ఉన్నాడని అతడి తండ్రి ప్రకాశ్ చంద్‌కు సమాచారం అందడం వల్ల వచ్చి సర్కాఘాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన చికిత్స కోసం హమీర్‌పుర్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. నవీన్ 90 శాతం కాలిపోయినట్లు వైద్యులు చెప్పారు.
"నేను వెళ్లే సరికి నా కుమారుడు ఇంటి బయట తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే స్థానిక పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించాను. అత్తింటి వారే చంపారని నా కుమారుడు ఆస్పత్రికి వెళ్తుండగా నాతో చెప్పాడు. అతడి భార్య నూనె పోయగా.. అత్త మంట పెట్టినట్లు నాతో తెలిపాడు. ఆ తర్వాత మామ, బావమరిది ఇద్దరూ కలిసి ఇంటి బయటకు తోసేసినట్లు వాపోయాడు."
-ప్రకాశ్ చంద్, మృతుడి తండ్రి