Man Cut His Neck For God :దేవుడికి నైవేద్యంగా తల సమర్పించేందుకు ఓ యువకుడు.. ఆలయం వద్ద మెడ కోసుకున్నాడు. అతడి అరుపులు విని ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు అది చూసి షాక్‌కు గురయ్యారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
లలిత్‌పుర్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల దీపక్ కుశ్వాహకు దైవభక్తి ఎక్కువ. కొన్ని రోజులుగా తన తలను దేవుడికి సమర్పించుకుంటానని తెలిసిన వారితో చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్నానం చేసి, చెట్లు నరికే కట్టర్‌తో దీపక్ స్థానిక ఆలయం వద్దకు చేరుకున్నాడు. తర్వాత దేవుణ్ని స్మరిస్తూ.. వెంట తెచ్చుకున్న కట్టర్‌ను మెడలో వేసుకొని ఆన్ చేశాడు. దీంతో మెడ కొసుకుంది. అతడి అరుపులకు అక్కడకు చేరుకున్న స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. రక్త స్రావం అవుతున్న దీపక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల.. వైద్యుల సలహా మేరకు అతడ్ని ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు.
అయితే దీపక్ కొన్ని రోజుల నుంచి, దేవుడికి తన తల సమర్పించాలనుకుంటున్నాడని అతడి సోదరుడు దేవరాజ్ కుశ్వాహ తెలిపాడు. కానీ దీపక్ ఇలా ఎందుకు చేశాడన్న విషయంపై స్పష్టత లేదని తన బంధువులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.