భార్య, బావమరిది కలిసి బలవంతంగా బీఫ్ తినిపించారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం గుజరాత్.. సూరత్‌లోని ఉఢానాలో జరిగింది. జూన్ 27న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు కారణమైన నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని రోహిత్ సింగ్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రోహిత్ సింగ్ సూరత్‌లోని టెక్స్టైల్ మిల్లులో రంగులు అద్దకం పని చేసేవాడు. అక్కడే అతడికి సోనమ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. రోహిత్ కుటుంబ సభ్యులు వీరిని ఇంటికి రానివ్వకపోవడం వల్ల రోహిత్, సోనమ్ వేరే కాపురం పెట్టారు. ఈ క్రమంలో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సోనమ్, బావమరిది అక్తర్ అలీ తనను హింసిస్తున్నారని, బలవంతంగా బీఫ్ తినిపించారని ఆరోపిస్తూ ఫేస్బుక్లో సూసైడ్ నోట్‌ను పోస్టు చేశాడు. ఈ సూసైడ్ నోట్‌ను రోహిత్ స్నేహితుడు చూడడం వల్ల దారుణం బయటపడింది.