తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ కూటమి దిశగా దీదీ- ఆ సీఎంలతో త్వరలోనే భేటీ!

Third Front in India: జాతీయ కూటమి దిశగా బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడుగులేస్తున్నారు. భాజపాయేతర పార్టీలను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. జాతీయ కూటమి ఆవిర్భావం లక్ష్యంతోనే ఇది జరుగుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ కూటమిలో కాంగ్రెస్‌ పార్టీని భాగస్వామిని చేసే ఉద్దేశం తమ నాయకురాలికి లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మమత
mamatha

By

Published : Mar 9, 2022, 7:20 AM IST

Third Front in India: జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా వేదికను సిద్ధం చేసుకుంటున్న బంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ భాజపాయేతర పార్టీలను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారని, జాతీయ కూటమి ఆవిర్భావం లక్ష్యంతోనే ఇది జరుగుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ కూటమిలో కాంగ్రెస్‌ పార్టీని భాగస్వామిని చేసే ఉద్దేశం తమ నాయకురాలికి లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

"ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాల్లేని కాంగ్రెస్‌ దాని సొంత మార్గంలోనే వెళ్తుంది" అని మమతా బెనర్జీ గతంలో వెల్లడించిన అభిప్రాయాన్ని వారు ఉటంకించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థపై నిరంతరం దాడి చేస్తోందని, గవర్నర్లను అడ్డుపెట్టుకొని రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని మమత విమర్శిస్తున్న విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే భాజపా వ్యతిరేక శక్తులన్నిటినీ ఒకేతాటిపైకి తీసుకురావాలన్న పట్టుదలతో మమత ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌; తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌లకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లినట్లు సమాచారం. భావసారూప్యం గల ఇతర ముఖ్యమంత్రులకు త్వరలోనే ఆహ్వానాలు వెళ్లనున్నాయి. వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి; బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లను ఆహ్వానించాలా, వద్దా అనే విషయంలో స్పష్టత రాలేదని సమాచారం.

ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాన మంత్రి అభ్యర్థి అంశాన్ని చర్చించేదిలేదని టీఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వ వివక్షకు గురవుతున్న, బాధితులుగా మారిన ముఖ్యమంత్రులను ఒక చోటకు చేర్చాలన్నదే భేటీ ప్రధాన ఉద్దేశమని తెలిపాయి. జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేనందు వల్లే కేంద్రంలో భాజపా అధికారంలో మనగలుగుతోందని మమతా బెనర్జీ మంగళవారం కోల్‌కతాలో అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు టీఎంసీ, ఇతర విపక్షాలు అన్నీ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సంస్థాగత సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి:

'ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు.. భాజపా భయపడుతోంది'

ABOUT THE AUTHOR

...view details