Mamata Banerjee letter: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవ్వాలని భాజాపాయేతర పార్టీలు, ముఖ్యమంత్రులకు బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ మేరకు వ్యూహాలపై చర్చించే సమావేశం కోసం పిలుపునిచ్చారు. భాజపాయేతర పార్టీలన్నీ ఐక్యత సాధించి.. దేశం కోరుకునే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేసే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని లేఖలో పేర్కొన్నారు.
విపక్షాల ఐక్యతకు దీదీ పిలుపు.. ఆ పార్టీలకు లేఖ - భాజపాయేతర సీఎంలకు మమతా బెనర్జీ లేఖ
Mamata Banerjee letter: కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో మరోసారి గళమెత్తారు. విపక్షాలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ శక్తులన్నీ ఒక వేదికపై సమావేశమై.. ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు భాజపాయేతర పార్టీలకు లేఖ రాశారు.
భాజపా అణచివేత పాలనపై పోరాడేందుకు ప్రగతిశీల శక్తులన్నీ చేతులు కలపాలి. దేశంలోని సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై భాజపా చేస్తున్న ప్రత్యక్ష దాడులపై ఆందోళన వ్యక్తం చేసేందుకే మీకు ఈ లేఖ రాస్తున్నా. సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఈ అంశంపై ముందుకు సాగేందుకు ఒక వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలందరం సమావేశం కావాలి. మన దేశానికి అవసరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఐక్యంగా, విలువలతో కూడిన ప్రతిపక్షం కోసం మనం కట్టుబడి ఉండాలి.
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి
ఇదీ చదవండి:సంపన్న కుటుంబంలో స్వతంత్ర జెండా.. ఉరికంబాన్ని ముద్దాడి..