Mamata Banerjee Allegations On BJP : ఈవీఎంలను హ్యాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విపత్తులు, నిరుద్యోగం, మతపరమైన ఉద్రిక్తతల నుంచి విపక్ష కూటమి 'ఇండియా' మాత్రమే కాపాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బంగాల్ సచివాలయం వద్ద మీడియా సమావేశంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.
'EVMలను బీజేపీ హ్యాక్ చేస్తోంది.. మా వద్ద ఆధారాలున్నాయ్'.. మమత సంచలన ఆరోపణలు
Mamata Banerjee Allegations On BJP : ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేస్తోందని బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన అరోపణలు చేశారు. ఆ పార్టీ ప్రతి విషయాన్ని కాషాయమయం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే?
'బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు ప్రాధాన్యం లేదు. ఇండియా కూటమి ఉనికి దేశవ్యాప్తంగా ఉంది. భారత్ మా మాతృభూమి. ఆ మాతృభూమి కోసం ఈ ఇండియా కూటమి ఉంది. బీజేపీ ఎప్పుడూ అసూయతో ఉంటుంది. హింస లేకుండా కదలిక లేదని బీజేపీ విశ్వసిస్తోంది. దీంతోపాటు బీజేపీ ప్రతి విషయాన్ని కాషాయమయం చేస్తోంది. ఆధునికత సాకుతో మెట్రో స్టేషన్లను అంతా కాషాయమయంగా మార్చేస్తోంది.'
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి
Mamata Banerjee INDIA Alliance : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెగ్గడానికి భాజపా ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుందని చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి భాజపా ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అందుకు తగ్గ ఆధారాలను కూడా సేకరించామని తెలిపారు. మరిన్ని ఆధారాలను కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పాటైన ఇండియా కూటమి తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని మమతా బెనర్జీ చెప్పారు.
Mamata Banerjee Vs BJP : మమతా బెనర్జీ చేసిన సంచలన ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హా స్పందించారు. 'ఎన్నికలను ఎవరు హ్యాక్ చేస్తారో దేశం మొత్తం చూసింది. వాళ్లు ఎప్పుడూ ఇలాంటి ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. 2021లో గెలిచినప్పుడు వారు (టీఎంసీ) ఈవీఎం హ్యాకింగ్ గురించి ఫిర్యాదు చేయలేదు' అని కౌంటర్ ఇచ్చారు.