కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో జరిగిన కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఓడిపోతామని తెలిసి భాజపా ప్రజలను భయపెడుతోందని.. ఈ కుట్రలో అమిత్‌షాకు కూడా భాగం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. హింగాల్ గంజ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు దీదీ.
'ఆ ప్రకటన తప్పు'
ఆత్మరక్షణ కోసమే సీఐఎస్ఎఫ్ కాల్పులు జరిపిందన్న ఎన్నికల సంఘం ప్రకటనను తప్పుపట్టారు మమత. ఈ ప్రకటన అవాస్తవం అని.. కాల్పుల ఘటనకు ఈసీ సిగ్గుపడాలని అన్నారు. అయితే ప్రజలు శాంతియుతంగా ఉండాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
"కేంద్ర బలగాల తీరును చూసి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించాను. దీని గురించి అనేక సార్లు ప్రస్తావించాను. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 17-18 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది తృణమూల్ నేతలే ఉన్నారు. అందరూ శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొని ప్రతీకారం తీర్చుకోండి."