దేశ ప్రజల్లో ఆర్థిక అసమానతలను భాజపా ప్రభుత్వం పెంచుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశంలో 40శాతం సంపద కేవలం ఒక్కశాతం మంది సంపన్నుల్లో ఉన్నట్లు ఓ అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. ముఖ్యంగా పేద, ధనికుల మధ్య అంతరం పెరగడానికి భాజపా విధానాలే కారణమని విమర్శించింది. వీటితో సామాన్య పౌరుడు అగాథంలో మునిగిపోతున్నాడని కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు. ఈ ఆర్థిక అసమానతల మధ్య అగాధాన్ని పూడ్చేందుకే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కేవలం కొంతమంది ప్రయోజనం కోసమే భాజపా ప్రభుత్వం పనిచేస్తోందని ట్విటర్‌లో ఖర్గే విమర్శించారు.
పేద, ధనికుల మధ్య అంతరం పెరగడానికి భాజపానే కారణం: కాంగ్రెస్
పేద, ధనికుల మధ్య అంతరం పెరగడానికి భాజపా విధానాలే కారణమని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజల్లో ఆర్థిక అసమానతలను భాజపా ప్రభుత్వం పెంచుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
భాజపాపై మల్లిఖార్జున ఖర్గే రాహుల్ గాంధీ విమర్శలు
మరోవైపు 21మంది కుబేరుల దగ్గరున్న సంపద దేశంలోని 70కోట్లకుపైగా పౌరుల వద్ద ఉన్న సంపదతో సమానమని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నాటి యూపీఏ ప్రభుత్వం 20కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందన్న రాహుల్... ప్రస్తుత ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలతో వారు మళ్లీ పేదరికంలోకి జారుకుంటున్నారని ఆరోపించారు. అంతకుముందు భారత్‌లోని 40శాతానికి పైగా సంపద ఒక శాతం జనాభాకు సమానమైన కుబేరుల చేతిలో ఉందని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తన వార్షిక అసమానత నివేదికలో వెల్లడించింది.