Male Contraceptive ICMR :పురుషులు వినియోగించగలిగేలా రూపొందిన ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజెక్షన్‌పై క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). ఈ ఇంజెక్షన్ ( Male Contraceptive Injection )తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సమర్థంగా పనిచేస్తోందని తేలింది. 99 శాతం సమర్థతతో సంతానోత్పత్తిని ఇది అడ్డుకుంటోందని పరిశోధనలో వెల్లడైంది. 25-40 ఏళ్ల మధ్య వయసు ఉన్న 303 మందిపై మూడో విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది ఐసీఎంఆర్. ఈ పరిశోధన ఫలితాలు ఆండ్రాలజీ జర్నల్‌లో గత నెలలో ప్రచురితమయ్యాయి.
Male Contraceptive Methods :పరిశోధనలో భాగంగా ఆరోగ్యంగా, లైంగికంగా చురుకుగా ఉన్న 303 మంది పురుషులను ఎంపిక చేశారు. శారీరకంగా, లైంగికంగా ఆరోగ్యంగా ఉన్న తమ భార్యలతో గర్భనిరోధక చికిత్స కోసం ఆస్పత్రులకు వచ్చిన సమయంలో వీరిని ట్రయల్స్‌కు ఎంపిక చేశారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో దిల్లీ, ఉధంపుర్, లూధియానా, జైపుర్, ఖరగ్‌పుర్‌లో ఈ పరిశోధనలు జరిగాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతితో పరిశోధనలు జరిగిన ఐదు కేంద్రాల్లోని నైతిక కమిటీల ఆమోదంతో ట్రయల్స్ నిర్వహించారు.
సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులేవి?
పరిశోధనలో భాగంగా పురుషులకు రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్ఐఎస్యూజీ) అనే ఇంజెక్షన్‌ను 60ఎంజీ మోతాదులో అందించారు. అజూస్పెర్మియా (వీర్యకణాలను నియంత్రించడం) సాధించడంలో ఈ ఇంజెక్షన్ 97.3 శాతం సమర్థంగా పని చేసిందని పరిశోధన వెల్లడించింది. గర్భాన్ని నిరోధించడంలో 99.02 శాతం పనితీరు కనబర్చిందని తేల్చింది. అందులోనూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది పనిచేసిందని తెలిపింది.
"ప్రపంచ జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పురుషులకు అధునాతన సంతాన నిరోధక పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్బడింది. వాసెక్టమీ వంటి పద్ధతుల్లో ఉన్న ఇబ్బందులు.. కొత్త చికిత్సా విధానాల అభివృద్ధికి బాటలు పరిచాయి. ఒకే ఇంజెక్షన్‌తో దీర్ఘకాలం సమర్థంగా పనిచేస్తూ, అతితక్కువ సైడ్ ఎఫెక్ట్స్ చూపించే పద్ధతి శ్రేయస్కరంగా ఉంటుంది. అవసరమైతే సంతాన సామర్థ్యాన్ని తిరిగి సాధించేలా ఇది ఉండాలి. ఇప్పటివరకు ఉన్న గర్భ/సంతాన నిరోధక పద్ధతుల్లో ఆర్ఐఎస్యూజీ ఇంజెక్షన్ అత్యంత సమర్థమైనదిగా తేలింది."
-పరిశోధన నివేదిక
ఈ ఇంజెక్షన్ భారీ స్థాయిలో ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుందని పరిశోధన పేర్కొంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తిరిగి ఆస్వాదించే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. హార్మోనల్ ఇంజెక్షన్ల మాదిరిగా రక్తనాళాల్లోకి దీన్ని ఎక్కించాల్సిన అవసరం లేకుండా.. శరీర భాగానికి ఇంజెక్ట్ చేస్తే సరిపోతుందని వివరించింది.
కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారా? మగ సంతానమే కావాలంటే..