Nitish Kumar Opposition : భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో దిల్లీ పర్యటనకు వెళ్లిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తొలి ప్రాధాన్యమని.. 2024 ఎన్నికల్లో ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది తర్వాత అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆఖరి రోజైన బుధవారం శరద్ పవార్‌తో దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం నీతీశ్ మాట్లాడుతూ.. భాజపాయేతర పార్టీలన్నీ ఏకమైతే అది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అవుతుందన్నారు. భాజపాయేతర పార్టీలతో సమావేశం చాలా బాగా జరిగిందని, సుదీర్ఘ చర్చలు జరిపినట్టు చెప్పారు. పలు రాష్ట్రాల్లోని భాజపాయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయన్నారు. తాను కలిసిన నేతలందరితో సానుకూలంగా చర్చలు సాగాయన్నారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎవరైనా అంటుంటే.. తాను మాత్రం మెయిన్ ఫ్రంటే అంటానన్నారు. ఎప్పుడైనా అది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అవుతుందని పునరుద్ఘాటించారు. భాజపా ప్రజలకోసం ఏమీ చేయడంలేదని నీతీశ్ ఆరోపించారు. ఆ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. భాజపాయేతర విపక్షాలను ఏకీకృతం చేయడంపై పవార్, తాను ఆసక్తితో ఉన్నామని.. నాయకత్వం ఎవరు వహిస్తారనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. మరోసారి దిల్లీ పర్యటనకు వస్తానని.. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటనలో ఉన్న సోనియా గాంధీని తర్వాత కలవనున్నట్టు తెలిపారు. మరోవైపు, బుధవారం సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్యతోనూ నీతీశ్ భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నీతీశ్ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కాగా.. మంగళవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓపీ చౌటాలా, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యారు.