తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాత్మా గాంధీకి 'మధురై' స్మృతి

స్వీయ వస్త్రధారణను స్వాతంత్ర్యోద్యమంలో భాగం చేసిన చతురుడు, రాజకీయ వ్యూహాల్లో నిపుణుడు మహాత్మా గాంధీ. సంప్రదాయ గుజరాతీ వస్త్రధారణ తీసివేసి, ధోతీ, అంగవస్త్రానికి మారిపోయి చరిత్ర సృష్టించారు. స్వదేశీ ఉద్యమానికి ఊపు తెచ్చి, వస్త్రధారణ నిబంధనలు ఉల్లంఘించి బ్రిటిషర్లకు సవాల్ విసిరారు. మహాత్ముని ఆలోచనను మార్చి వస్త్రధారణ మార్పునకు దక్షిణాది నగరం మధురై వేదికైంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా గాంధీ నూతన వస్త్రధారణ సందర్భాన్ని వేడుకగా చేసేందుకు ఆధ్యాత్మిక నగరి సిద్ధమైంది.

gandhi
గాంధీజీ

By

Published : Sep 18, 2021, 3:17 PM IST

Updated : Sep 18, 2021, 5:33 PM IST

మహాత్మా గాంధీకి 'మధురై' స్మృతి

ఒక శతాబ్దకాలం నాటి మాట. గాంధీ చూపిన బాట. అది 1921 సెప్టెంబర్ 22 వతేదీ. మహాత్మా గాంధీ తన సంప్రదాయ సౌరాష్ట్ర వస్త్రధారణను వీడి, ధోవతి, కొల్లాయిగా పిలిచే అంగోస్త్రం ధరించిన రోజు. దేహానికి సగమే ధరించిన వస్త్రాలతో ఆయన రూపంలో ఓ ఫకీరును తలపించారు. ఆయన తన ఆహార్యం మార్చిన ఆ ఇల్లు నేడు ఖాదీ విక్రయకేంద్రంగా మారిపోయింది. ఎందుకు గాంధీ అంతటి తీవ్రనిర్ణయం తీసుకున్నారంటే...' పేదలకు భిన్నమైన దుస్తులు వేసుకుంటే వారితో నన్ను నేనెలా పోల్చుకోగలను? ' అని తన వస్త్రధారణ మార్పునకు కారణం చెప్పారు. ' నా జీవనయానంలో నేను చేసుకున్న అన్ని మార్పులు ముఖ్యమైన సందర్భాలకు అనుగుణంగా ప్రభావితమై చేసినవే. ఎంతో లోతుగా ఆలోచన చేశాకే అలాంటి నిర్ణయాలు తీసుకున్నాను. నా వస్త్రధారణలో తీవ్ర మార్పూ అలాంటిదే. ఇంకేమీ చేయలేను. అందుకు నేనేమీ విచారించటం లేదు' అని మహాత్ముడు వివరణ ఇచ్చారు.

"సెప్టెంబర్ 21, 22 మధ్యరాత్రి ఆయన అంతర్వాణి ఈ మార్పుకోసం మార్గదర్శనం చేసింది. అదే పాటిస్తూ అర్ధరాత్రి నిద్ర నుంచి మేల్కొని గుజరాతీ వస్త్రధారణ తీసివేశారు. పంచెను చింపి రైతులు ధరించే తరహా అంగోస్త్రం చేసి ధరించారు. తర్వాత మళ్లీ నిద్రపోయారు. గాంధీజీ సరిగ్గా ఇదే గదిలో ఆహార్యంలో మార్పులు చేసుకున్నారు."

--ప్రొ.రవిచంద్రన్ , గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్.

'భారతీయులు పేదరికంతో అర్ధనగ్నంగానే ఉన్నారు. బ్రిటన్ వల్లనే పేదలయ్యారు' అని గాంధీ నిశ్చితాభిప్రాయం. ఏదెలా ఉన్నా.. చక్రవర్తిని కలిసేందుకు ఇలా చాలీచాలని దుస్తుల్లో వెళ్లవచ్చా? అన్న ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు గాంధీ 'మా ఇద్దరికీ సరి పడా దుస్తులు చక్రవర్తి ఒక్కరే ధరించే ఉన్నారు కదా’' ఘాటుగా జవాబిచ్చారు.

గాంధీజీ

గాంధీ ఏమి బొధించారో అదే ఆచరించారు. ప్రతి మనిషి తనకు కావల్సిన వస్త్రాలను తనే మగ్గంమీద తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వస్త్రధారణ శైలి మార్పు మీద ప్రశంసలూ వచ్చాయి. అభిశంసలూ వచ్చాయి. లండన్ లో బకింగ్ హామ్ ప్యాలెస్ లో తేనీటి విందుకు హాజరుకావాలని కింగ్ జార్జి-5 నుంచి గాంధీజీకి అయిష్టపూర్వక ఆహ్వానం అందిన అంశం ప్రస్తావించదగింది. గాంధీ అంగవస్త్రం ధరించి, శాలువా కప్పుకుని హాజరయ్యారు. అది అక్కడి నియమనింబధనలకు విరుద్ధం. కానీ గాంధీజీ ఆ తరువాత రౌండ్ టేబుల్ సమావేశాలకు ఇదే వస్త్రధారణతో హాజరయ్యారు.

"లండన్ ఏ ఒక్కరి కోసమో సంప్రదాయ చట్టాలను మార్చదు. కానీ రౌండ్ టేబుల్ సమావేశానికి కురచవస్త్రాలతో హాజరైన గాంధీజీ కోసం నిబంధనలను వారం పాటు తాత్కాలికంగా సడలించుకోవాల్సి వచ్చింది. మొట్టమొదటగా బ్రిటీష్ చట్టంపై మన వస్త్రధారణ విజయం ఇది."

-- నేతాజీ స్వామినాథన్, నేతాజీ పీపుల్స్ మూవ్ మెంట్‌, వ్యవస్థాపకులు.

కరైకుడి వెడుతూ..మార్గమధ్యంలో రెండో పర్యాయం మధురై వచ్చినప్పుడు గాంధీజీ పశ్చిమ మాసి వీధిలోని ఈ ఇంట్లో ఉన్నప్పుడే వస్త్రధారణ శైలి మార్చారు. మామూలు రైతులు ధరించే అంగవస్త్రం వేసుకున్నారు. ఒక జన సమూమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిటిష్ వాళ్ల దోపిడీ మీద తొలిసారి రాజకీయంగా విమర్శలు గుప్పించిన ప్రదేశం మధురైనే.

"గాంధీజీ స్వయంగా ఒక నిశ్చయానికి వచ్చారు. దేశంలో పేదరికం పోయేదాకా, ప్రతి పౌరుడు గౌరవప్రద జీవనోపాధి పొందేదాకా సాధారణ దుస్తులనే ధరించాలని నిర్ణయించారు. గాంధీజీలో పరివర్తన పరిణామక్రమం ఇక్కడే జరిగినందుకు మాకెంతో గర్వంగా ఉంది."

--ప్రొ. రవిచంద్రన్, గాంధీ గ్రామ్ రూరల్ ఇన్ స్టిట్యూట్.

గాంధీజీ తన నడుము చుట్టూ కొల్లాయిగట్టి, కొత్త రూపంలో బహిరంగా ప్రజలకు దర్శనమిచ్చిన ఈ ప్రదేశాన్ని ‘గాంధీ పొత్తల్ ’ అని పిలుస్తున్నారు. నూతన రూపంలో తొలిసారి కనపడిన రూపంలో గాంధీజీ విగ్రహాన్ని మధురై కామరాజర్ రోడ్డులోని అలంకార్ థియేటర్ ఎదురుగా ఏర్పాటుచేశారు.

"ఈ స్థలం గాంధీజీ తన రూపాన్ని మార్చుకున్న తర్వాత తొలిసారి మాట్లాడిన ప్రదేశం. ఆయన స్మారకార్థం ఈ శతాబ్ది సంవత్సరాన్ని విస్తృతంగా నిర్వహించే ప్రణాళికలు మాకు ఉన్నాయి."

-- రాజా, గాంధీజీ విగ్రహ కమిటీ నిర్వాహకుడు.

'ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకునే మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి' అని అనటంతోనే ఆగిపోలేదు. మహాత్మా గాంధీ తన మాటలను ఆచరణలో పెట్టి ఆదర్శమూర్తి అయ్యారు. గాంధీజీ కొల్లాయి ఒక బ్రాండ్ అయ్యింది. ధోవతి, అంగోస్త్ర వ్యూహంతో దేశవాసులు హృదయాలపై ప్రగాఢ ముద్రవేశారు. అది అంతిమంగా విదేశీ వస్తు బహిష్కరణకు దారి తీసింది. దేశ స్వాతంత్ర్యోద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది.

ఇదీ చదవండి:ఆపరేషన్​ పోలోకు ముందే తెరవెనక యుద్ధం!

Last Updated : Sep 18, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details