తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'NCPకి అధ్యక్షుడిని నేనే.. 82 కాదు.. 92 ఏళ్లు వచ్చినా రాజకీయాల్లో సమర్థుడినే'

NCP Sharad Pawar : ఎన్​సీపీకి అధ్యక్షుడిని తానేనని శరద్ పవార్​ స్పష్టం చేశారు. 82 ఏళ్ల వయస్సులో ఉన్నా లేదా 92 ఏళ్లు వయస్సుకు వచ్చినా ఇప్పటికీ రాజకీయాల్లో సమర్థుడినేనని.. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. మరోవైపు, శరద్​ పవార్​ను కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కలిశారు.

NCP Sharad Pawar
NCP Sharad Pawar

By

Published : Jul 6, 2023, 6:30 PM IST

Updated : Jul 6, 2023, 7:07 PM IST

NCP Sharad Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధ్యక్షుడిని తానేనని శరద్ పవార్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ ఏది చెప్పినా దానికి ప్రాముఖ్యం లేదని పేర్కొన్నారు. దిల్లీలో ఎన్​సీపీ జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత మాట్లాడిన శరద్ పవార్.. తాను 82 వయస్సులో ఉన్నా లేదా 92 ఏళ్లు వయస్సుకు వచ్చినా ఇప్పటికీ రాజకీయాల్లో సమర్థుడినేనని.. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. మెజారిటీ ఎవరికి ఉందనేది త్వరలోనే బయటకు వస్తుందని అజిత్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ శరద్ అన్నారు.

'8 తీర్మానాలు ఆమోదించాం'
మరోవైపు.. దిల్లీలో గురువారం జరిగిన సమావేశంలో 8 తీర్మానాలను ఆమోదించినట్లు ఎన్​సీపీ నేత చాకో తెలిపారు. ఇటీవలే బీజేపీతో చేతులు కలిపిన ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేతో పాటు మరో తొమ్మిది మందిని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పార్టీ ఆమోదించిందని చెప్పారు. శరద్​ పవార్​ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఆయన వెంట తాము ఉన్నామని అన్నారు. తమ పార్టీ ఎప్పటికీ చెక్కు చెదరదని వ్యాఖ్యానించారు.

శరద్​ పవార్​ను కలిసిన రాహుల్​..
దిల్లీలో ఉన్న ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ను గురువారం సాయంత్రం.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కలిశారు. వారిద్దరూ మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు సమాచారం.

'శరద్ ​పవార్​ సమావేశానికి చట్టబద్ధత లేదు'
శరద్​ పవార్​ నేతృత్వంలో జరిగిన ఎన్​సీపీ వర్కింగ్​ కమిటీ సమవేశానికి చట్టబద్ధత లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ వర్గంవిమర్శించింది. "దిల్లీలో శరద్​పవార్​ నేతృత్వంలో ఎన్​సీపీ వర్కింగ్​ కమిటీ సమావేశం జరిగిందని తెలిసింది. మెజారిటీ ప్రజాప్రతినిధులు, పార్టీ సభ్యుల మద్దతుతో గత నెల 30వ తేదీన అజిత్ పవార్ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిజమైన ఎన్​సీపీ పార్టీ మాదే. అందుకే పార్టీ పేరుతో పాటు గుర్తును తమకు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరాం" అని అజిత్​ పవార్​ వర్గం పేర్కొెంది.

ఎన్‌సీపీ తిరుగుబాటులో 'బాహుబలి' పోస్టర్లు!
అయితే అజిత్‌ పవార్‌ తిరుగుబాటును ఉద్దేశిస్తూ దిల్లీలోనిశరద్‌ పవార్ నివాసం వెలుపల ఆయన మద్దతుదారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. అందులో టాలీవుడ్​ బ్లాక్‌ బస్టర్ చిత్రం బాహుబలిలోని ఓ సన్నివేశాన్ని ప్రచురించారు. బాహుబలిని కట్టప్ప వెనక నుంచి కత్తితో పొడిచే ఆ దృశ్యంలో కట్టప్ప స్థానంలో అజిత్ పవార్‌, బాహుబలి స్థానంలో శరద్‌ పవార్‌ను ఉంచారు. అత్యంత ఆత్మీయంగా మెలిగిన వ్యక్తే వెన్నుపోటు పొడిచారనేది దీని సారాంశంగా కనిపిస్తోంది. ఎన్​సీపీ విద్యార్థి విభాగం దీనిని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. "ద్రోహి" అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాటిపై ప్రస్తావించారు.

ఎన్‌సీపీ తిరుగుబాటులో 'బాహుబలి' పోస్టర్లు!

అజిత్​దే పైచేయి!
ముంబయిలో బుధవారం జరిగిన వేర్వేరు సమావేశాల్లో అజిత్‌వైపే అత్యధిక MLAల మొగ్గు కనిపించింది. 53 మందికిగాను శరద్ పవార్ వైపు కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించారు. అలాగే ఎన్​సీపీ పార్టీ పేరు, గుర్తు తమ వర్గానికి చెందుతాయని అజిత్ పవార్‌ ఈసీ వద్ద పిటిషన్ వేయగా. 9మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశామని శరద్‌ పవార్‌ వర్గం కేవియట్ దాఖలు చేసింది.

Last Updated : Jul 6, 2023, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details