తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' బలపరీక్షలో నెగ్గిన సీఎం శిందే.. మరోసారి సుప్రీంకు ఠాక్రే వర్గం - మహారాష్ట్ర ఏక్​నాథ్​ శిందే

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగిసింది. నూతన ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే.. సోమవారం జరిగిన బలపరీక్షలో నెగ్గారు. 164 మంది ఎమ్మెల్యేలు శిందేకు మద్దతుగా నిలిచారు. మరోవైపు, శివసేన చీఫ్​ విప్​గా సునీల్​ ప్రభును తొలగించి.. భరత్​ గోగావలేను నియమించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

maharastra cm eknath shinde won in floor test
maharastra cm eknath shinde won in floor test

By

Published : Jul 4, 2022, 11:31 AM IST

Updated : Jul 4, 2022, 12:04 PM IST

Maharastra Politics: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్​నాథ్​ శిందే.. సోమవారం నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. శిందేకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు.

సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను మొదలుపెట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. సీఎం శిందేకు అనుకూలంగా 164 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. నాటకీయ పరిణామాల మధ్య జూన్​30న ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎంగా భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు.

శిందే వర్గంలోకి మరో ఎమ్మెల్యే.. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మరో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. మహారాష్ట్ర సీఎం శిందే వర్గంలోకి చేరారు. బంగర్ సోమవారం ఉదయం శిందే వర్గ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు.

ఠాక్రేకు షాకిచ్చిన మహా స్పీకర్​.. ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వ బలపరీక్షకు ముందు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చారు మహా అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్. ప్రస్తుతం శివసేన శాసనసభా పక్షనేతగా ఉన్న అజయ్ చౌదరిని తొలగించి, శిందేను తిరిగి స్పీకర్​ నియమించారు. శివసేన చీఫ్​ విప్​గా ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్​ ప్రభును తొలగించి.. భరత్​ గోగావలేను నియమించారు. అయితే, ఈ నిర్ణయంపై ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై​ జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసం తెలిపింది.

'మరో ఆరునెలల్లో ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి'..
మహారాష్ట్రలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎన్సీపీ అధినేత శరద్​పవార్​ అన్నారు. మరో ఆరు నెలల్లో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. "మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, అందుకే మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. శిందేకు మద్దతు ఇస్తున్న నేతలు ఎవరూ సంతోషంగా లేరు. మంత్రివర్గ విస్తరణ సమయంలో మనస్పర్థలు వస్తాయి. అప్పుడు కచ్చితంగా శిందే ప్రభుత్వం పతనమవుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ మా దగ్గరికే వస్తారు" అని పవార్‌ తెలిపారు. కేవలం ఆరు నెలలే సమయం ఉందని, ఎన్సీపీ శాసనసభ్యులు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు.

'శిందే వర్గ నేత అసలు శివసేన అని చెప్పుకోలేరు'.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే బృందంలో శివసేన రెబల్​ ఎమ్మెల్యేలు అసలైన శివసేన నేతలు అని చెప్పుకోలేరని ఎంపీ సంజయ్​ రౌత్​ అన్నారు. శిందే వర్గానికి చట్టబద్ధత ఉందా అని ఆయన ప్రశ్నించారు. "శిందే వర్గ ఎమ్మెల్యేలు తమ తాము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పార్టీ గుర్తును ఉపయోగించారు. గెలిచాక పార్టీ ప్రయోజనాలను అనుభవించారు. ఇప్పుడేమో తిరుగుబాటు చేశారు. ఇది సరైన పద్ధతా? దీనిపై మేము కోర్టులోనే తేల్చుకుంటాం. ఠాక్రే, శివసేన రెండూ పర్యాయపదాలు. ఆ రెండూ వేర్వేరు అని మీరెలా అంటున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనకూడదని పార్టీ ఆదేశాన్ని ధిక్కరించినందుకు జేడీయూ నాయకుడు శరద్ యాదవ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. అయితే శిందే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు మేము సస్పెండ్​ చేయడానికి ఆ నియమాలు వర్తించవా?" అని సంజయ్​రౌత్​ ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే

మామ కౌన్సిల్​ ఛైర్మన్.. అల్లుడు అసెంబ్లీ స్పీకర్​.. దేశంలోనే యంగెస్ట్ సభాపతి!

Last Updated : Jul 4, 2022, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details