Nawab Malik: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మాలిక్. ఉదయం 7 గంటలకు విచారణ చేపట్టారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని విచారించినట్లు తెలిసింది. దావూద్ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్ సోదరుడు ఇబ్రహిం కస్కర్‌తో సహా పలు అనుమానిత నిందితులకు సంబంధించిన సంబంధాలపై ఈడీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్‌కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రహిం కస్కర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్ మాలిక్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెప్పారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంతకాలం క్రితం ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది ఈడీ. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్ లావాదేవీల పత్రాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్‌ను ప్రశ్నించిటనట్లు పేర్కొన్నారు.
నవాబ్ మాలిక్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సమయం నుంచి ఆయన నివాసాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు అధికారులు.