Eknath Shinde Floor Test: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమవుతోంది. దీని కోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 3న ప్రారంభం కానున్నాయి. విశ్వాస పరీక్షకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి శిందే 4న సభ ముందుంచుతారని విధాన్‌భవన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలోనే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. సభాపతి పదవికి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ పదవికి భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. గురువారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో జులై 2, 3 తేదీల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఈ తేదీల్లో మార్పులు జరిగాయి. తాజా షెడ్యూల్ ప్రకారం 3న ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. సభాపతి పదవికి ఓటింగ్ అనివార్యమైతే అదే రోజు ఎన్నిక జరుగుతుంది. 4న శిందే ప్రభుత్వ బలపరీక్ష ఉంటుంది. ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే.. ఉపముఖ్యమంత్రి, భాజపా నేత ఫడణవీస్‌ను శుక్రవారం రాత్రి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ధనంజయ్..దివంగత భాజపా సీనియర్ నేత గోపీనాథ్ ముండే సమీప బంధువు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు.
భాజపా వేడుకలకు ఫడణవీస్ దూరం
మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా భాజపా శ్రేణులు ముంబయిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం వేడుకలు జరుపుకొన్నాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఫడణవీస్ పాల్గొనలేదు. హైదరాబాద్‌లో జరిగే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ ప్రత్యేక భేటీకి సంబంధించిన విషయాల్లో తీరిక లేకుండా ఉన్నందునే ఫడణవీస్ పార్టీ సమావేశంలో పాల్గొనలేకపోతున్నారని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు.