పెద్దపులి ఎప్పుడూ గర్జించాలి. అదే దానికి ప్రత్యేకతను, వీరత్వాన్ని, ధీరత్వాన్ని ఇస్తుంది. రాజకీయాల్లోనూ నేతలు అలాగే ఉండాలి. ఒకపార్టీని నడుపుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా పార్టీశ్రేణులపై పూర్తి పట్టు కలిగి ఉండాలి. ఏ మాత్రం పట్టుజారినా మొదటికే మోసం వస్తుంది. ఇది అక్షరాల మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిణామం. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరొందిన శివసేన నిలువునా చీలిపోయే పరిస్థితులకు చేరుకుంది. మృదుస్వభావిగా పేరొందిన శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై నియంత్రణ కోల్పోవడంతో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది. సేన ప్రస్తుత పరిస్థితికి కారణాలను పరిశీలిస్తే..
హిందుత్వ నుంచి మళ్లడం..బాలాసాహెబ్‌గా పిలుచుకునే బాల్‌ఠాక్రే భూమిపుత్రుల నినాదంతో శివసేనను నెలకొల్పారు. అనంతరం కొన్ని సంవత్సరాలకు హిందుత్వబాట పట్టింది. ముంబయి, ఠానే, పాల్ఘార్, కొంకణ్, మరఠ్వాడా ప్రాంతాలో బలంగా విస్తరించింది. భాజపాతో సన్నిహిత సంబంధాలు పార్టీని ముందుకు నడిపించాయి. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-భాజపా కూటమి అధికారం అందుకుంది. అనంతరం హిందుత్వకు సంరక్షణ పార్టీగా సేన పేరొందింది. ఒక దశలో బాల్‌ఠాక్రేను హిందు హృదయ సామ్రాట్ అని ప్రేమతో పిలిచేవారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే భాజపాతో కలిసి పోటీచేసినా సీఎం పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీంతో రాష్ట్రంలో శివసైనికులు నిర్ఘాంత పోయారు. దాదాపు మూడు దశాబ్దాలు తాము ఎవరితో పోరాడామో వారితో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇందులో ఏక్‌నాథ్‌శిందే ఒకరు.
పులి గర్జించలేదు..బాల్‌ఠాక్రే ఉన్న సమయంలో ఆయన మాటలు తూటాల తరహాలో దూసుకువచ్చేవి. ఒక ప్రకటన చేసిన తరవాత వెనక్కు తిరగడమన్నది జరగలేదు. అయితే ఉద్ధవ్ వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నం. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో దిట్ట అయినా శివసేన సహజమైన దూకుడు వైఖరి లేకపోవడం ఒక మైనస్. ఆయన కుమారుడు యువనేత ఆదిత్య రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా పాఠాలు నేర్వలేదు. దీంతో అనేకమంది కార్యకర్తలు భాజపా లేదా ఇతర కాషాయ పార్టీలవైపు వెళ్లారు.