MAHARASHTRA CABINET EXPANSION: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో 18 మందికి చోటు లభించింది. 9 మంది భాజపా ఎమ్మెల్యేలు, మరో 9 మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా మంగళవారం ముంబయిలో ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో మహారాష్ట్ర మంత్రివర్గం బలం 20కి చేరింది. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 43 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుత కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం.
గవర్నర్ బీఎస్ కోశ్యారీ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. 15 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణస్వీకారం జరిగింది. భాజపా నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా సుధీర్ ముంగటివార్, గిరిష్ మహాజన్, సురేశ్ ఖాడె, రాధాకృష్ణ విఖె పాటిల్, రవీంద్ర చవాన్, మంగల్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సావె మంత్రి పదవి దక్కించుకున్నారు. శివసేన వర్గం నుంచి దాదా భూసే, శంభురాజే దేశాయ్, సందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసార్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.