Maharashtra Amravathi accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి జిల్లాలో ఓ ఎస్యూవీ బ్రిడ్జి పైనుంచి నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఒకరికి గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పరాఠ్వాడా బైతుల్ రహదారిపై ఉన్న నింభోరా ఫాటా మలుపు వద్ద కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. భారీ వర్షాల వల్ల రహదారి సరిగా కనిపించకుండా ఉందని.. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి బ్రిడ్జి నుంచి పక్కకు వెళ్లి ఉంటుందని పోలీసులు వివరించారు.
"ఎస్యూవీ, ఓ ద్విచక్రవాహనం పరాఠ్వాడా నుంచి బోదాడ్కు వెళ్తున్నాయి. నింభోరా ఫాటా వద్ద ఎస్యూవీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఎస్యూవీలో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో నలుగురు చనిపోయారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు."
-పోలీసులు