కుంకుమ పువ్వును ఎన్ని దేశాలలో పండించినా, కశ్మీరీ కుంకుమ పువ్వుకు ఉండే ప్రత్యేకతే వేరు. సాధారణంగా ఈ పేరు వినగానే ముందుగా గర్భిణులే గుర్తుకొస్తారు. ఎందుకంటే వీటిని పాలల్లో కలిపి తాగితే పిల్లలు అందంగా, మంచి రంగుతో పుడతారని చాలామంది నమ్మకం. అలాగే వంటల్లోనూ వీటి రేకలను వాడుతుంటారు. ఎందుకంటే ఈ రేకలు ఆరోగ్యాన్నిస్తాయి. అందానికి మెరుగులు దిద్దుతాయి. ఒకట్రెండు తీసుకున్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అత్యంత ఖరీదైన ఈ పూరేకల వల్ల కలిగే లాభాలూ ఎక్కువే. సాధారణంగానే ఒక గ్రాము కుంకుమ పువ్వు రూ.300 నుంచి రూ.1500 వరకు ఉంటుంది. మన దేశంలో ఈ కుంకుమ పువ్వును 3 నుంచి 4శాతం మాత్రమే సాగుచేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఈ పువ్వును సాంకేతికతను వినియోగించి వినూత్న రీతిలో సాగు చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు విత్తనాలు తెచ్చి కంటెయినర్లో పండిస్తున్నారు.
కశ్మీరీ కుంకుమ పువ్వు.. కంటెయినర్లలో సాగు.. - మహారాష్ట్రలో కుంకుమ పువ్వు సాగు
కుంకుమ పువ్వును ఎన్ని దేశాలలో పండిస్తున్నా కశ్మీరీ కుంకుమ పువ్వుకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ పువ్వును మన దేశంలో 3 నుంచి 4శాతం మాత్రమే పండిస్తున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో ఈ కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాడు.
మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన శైలేష్.. ఆరేళ్ల క్రితమే ఏరోపోనిక్ పద్ధతిలో ఈ సాగను ప్రారంభించాడు. దాదాపు 320 చదరపు అడుగుల విస్తీరణం గల కంటెయినర్లో అతడు విత్తనాలు నాటి పంటను పెంచుతున్నాడు. " మొదట్లో కంటెయినర్లో ఈ పువ్వును సాగుచేయడం చూశాను. దీంతో కశ్మీర్ వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడి ఎలా సాగు చెయ్యాలో తెలుసుకున్నాను. కశ్మీర్ వాంపోర్ ప్రాంతం నుంచి 12 కిలోల కుంకుమ పువ్వు విత్తనాలను తెప్పించాను. తర్వాత దానిని నియంత్రిత వాతావరణంలో కంటెయినర్లో నాటాను. వీటిని పెంచడానికి నేను ఎయిర్ సర్క్యులేటర్, చిల్లర్, ఏసీ, డెహుమిడిఫైయర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాను" అని శైలేష్ తెలిపారు.
ప్రస్తుతం అతడు పుణెలోని వార్జే ప్రాంతంలో కంటెయినర్లో ట్రేను ఏర్పాటు చేసి 400 నుండి 600 విత్తనాలను నాటారు. దాని నుంచి దాదాపు 1.5 కిలోల కుంకుమపువ్వు పండుతుందని శైలేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో గ్రాము ధర రూ.499 ఉండగా, కిలోకు రూ.6.23 లక్షలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తాను ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై రూ.8లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.