రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు ఇకపై కచ్చితంగా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది.
కరోనా రిపోర్టు ఉంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ - కొవిడ్ లక్షణాలు ఉంటే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ లేదు
కరోనాను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.
కొవిడ్ లక్షణాలు ఉంటే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ లేదు
దిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా నుంచి వచ్చే ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో కొవిడ్-19 లక్షణాలు ఉంటే తిరిగి పంపిస్తామని తెలిపింది.
విమానంలో వచ్చేవారు ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేసుకోవాలని సూచించింది. ప్రయాణికుల రిపోర్టును పరిశీలించాలని రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. రైళ్లలో రాష్ట్రంలోకి వచ్చే వారు ప్రయాణానికి 96 గంటల ముందు పరీక్షలు చేయించుకోవాలని సూచించింది మహారాష్ట్ర సర్కార్.