సామాజిక మాధ్యమాల నుంచి ఎదురైన వ్యతిరేకతతో హిందూ- ముస్లిం వధూవరుల మధ్య పెళ్లి ఆగిపోయింది. మహారాష్ట్ర నాశిక్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల హిందూ మహిళ.. ముస్లిం వ్యక్తిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా చేయాలనుకున్న పెళ్లి వేడుకను.. పలు వర్గాల నుంచి ఎదురైన వ్యతిరేకత కారణంగా ఆపేశారు. ఈ మేరకు మహిళ తండ్రి.. మత పెద్దలకు లేఖ రాశారు.
జులై 18న ఈ వివాహం జరగాల్సి ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనికి పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పెళ్లికి వ్యతిరేకంగా పోస్టులు చేశారు. లవ్ జిహాద్ పేరిట వాట్సాప్ గ్రూపుల్లో పత్రికను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో వివాహాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళ తండ్రి స్పష్టం చేశారు. మే నెలలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగినప్పటి నుంచి కూతురు తమ ఇంట్లోనే ఉంటోందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దంపతులిద్దరూ కలిసి ఉంటారో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.