Madurai Train Accident Today :తమిళనాడులోని మదురై రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది పర్యటకులు మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాదిలో ఆధ్యాత్మిక దర్శనం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి ఆగస్టు 17న ఓ టూరిస్ట్ రైలు బయలుదేరింది. అందులో 60 మందికి పైగా యాత్రికులు తమిళనాడు నాగర్‌కోయిల్‌లోని పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని శనివారం తెల్లవారుజామున రైలులో మదురై చేరుకున్నారు. అయితే ఆ రైలు.. మదురై రైల్వే స్టేషన్‌కు ఒక కిలో మీటరు దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తమతో పాటు తెచ్చుకున్న సిలిండర్‌ను ఉపయోగించి టీ తయారు చేసుకుందామనుకున్నారు.
అయితే టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్ పేలి మంటలు (Madurai Train Fire News) చెలరేగాయి. వెంటనే ఆ మంటలు రెండు కోచ్‌లకు వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. అయితే కొందరు అందులోనే చిక్కుకుపోయి మరణించారు.
Madurai Train Fire Accident News :ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. మదురై కలెక్టర్ సంగీత ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్- ఆర్పీఎఫ్ పోలీసులు, ఎస్ఎస్ కాలనీ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు మంత్రి మూర్తి సహా తదితరులు ఘటనా స్థలిని సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.