OPS EPS TUSSLE: అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం (ఏడీఎంకే) ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని పళనిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నవారు ఓటేసి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. అప్పటివరకు పళనిస్వామి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
జయలలిత మృతి తర్వాత పార్టీలో కొనసాగుతున్న ద్వంద్వ నాయకత్వ విధానాన్ని సమావేశంలో రద్దు చేశారు. పార్టీ కోఆర్డినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేశారు. దీంతో పార్టీ నాయకత్వ పగ్గాలు ఎవరైనా ఒక్కరే చేపట్టే అవకాశం ఉంటుంది. గతంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం పార్టీ పగ్గాలు పంచుకోగా.. తాజాగా ఈ సంప్రదాయానికి తెరపడినట్లైంది.
పార్టీ బహిష్కరణ
అదేసమయంలో, పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పన్నీర్‌సెల్వం ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడం సహా కోశాధికారి పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఆయన అనుచరులను సైతం బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైకోర్టు షాక్
అంతకుముందు, ఈ సమావేశాలను అడ్డుకోవాలంటూ పన్నీర్‌సెల్వం వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. వ్యాజ్యాన్ని కొట్టివేసిన ధర్మాసనం.. సమావేశాలను యథావిధిగా జరుపుకొనేందుకు అనుమతించింది.
అన్నా డీఎంకే కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళన మరోవైపు, అన్నా డీఎంకే పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పళనిస్వామికి స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకోగా.. పన్నీర్‌సెల్వానికి మద్దతిస్తున్న వారు నినాదాలు చేయడం వల్ల.. ఉద్రిక్తత తలెత్తింది. కొందరు కార్యకర్తలు కుర్చీలు విరగొట్టి ఆందోళన చేశారు. మరికొందరు పత్రాలు తగులబెట్టారు.
కుర్చీలు విరగ్గొట్టిన కార్యకర్తలు