Madhya Pradesh New CM :మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ను బీజేపీ ఎంపిక చేసింది. ఆయనను పార్టీ శాసనసభాపక్ష నేతగా కొత్త ఎన్నికైన ఎమ్మల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కాదని ఈ సారి పార్టీ అధిష్ఠానం మెహన్ యాదవ్ వైపు మొగ్గు చూపింది.
భోపాల్‌లో సోమవారం సాయంత్రం జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి పార్టీ పరిశీలకులుకుగా హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన 163 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం మోహన్ యాదవ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి పరిశీలకులు తెలియజేశారు. మోహన్ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం అభినందనలు చెప్పింది.
నా శక్తిమేరకు కృషి చేస్తా: సీఎం
మరోవైపు, మధ్యప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత మోహన్ యాదవ్ మట్లాడారు. "నాలాంటి చిన్న నాయకుడికి బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదంతో నా శక్తిమేరకు కృషి చేస్తాను" అని తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సహా పలువురు ఎంపీలు, కేంద్రమంత్రుల పేర్లు వినిపించాయి. వారందరినీ పక్కనబెట్టి కొత్త వ్యక్తిని అధిష్ఠానం అవకాశం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కార్యకర్తల సంబరాలు
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ఎన్నికైన ఆయన ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. మోహన్ యాదవ్ కుటుంబసభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యుడు సీఎం అవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
'అంతా దేవుడి ఆశీర్వాదం'
"మోహన్ యాదవ్ సీఎం పదవి దక్కడం భగవాన్ మహకాల్ ఆశీర్వాదం. పార్టీ పెద్దల ఆశీర్వాదం. 1984 నుంచి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు" అని మోహన్ యాదవ్ భార్య చెప్పారు. తమ ఆనందానికి అవధులు లేవన ఆయన సోదరి తెలిపారు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చారని అన్నారు.
గవర్నర్ వద్దకు కొత్త సీఎం- పాత సీఎం!
బీజేపీ శాసనసభాపక్ష నేతగా తర్వాత పార్టీ సీనియర్ నాయకులతో కలిసి రాజభవన్‌కు వెళ్లారు మోహన్ యాదవ్. గవర్నర్ మంగూభాయ్ సి పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు. మరోవైపు, శివరాజ్ సింగ్ చౌహాన్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు.
పదేళ్లలో సీఎం స్థాయికి మోహన్ యాదవ్!
సరిగ్గా పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు మోహన్ యాదవ్(58). 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో అప్పటి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ఆయనను కేబినెట్ మంత్రిగా నియమించింది. ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి విజయం సాధించారు. మోహన్ యాదవ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి అనుబంధం ఉంది.
ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లు ప్రకటన
సీఎం పేరుతోపాటు ఛత్తీస్‌గఢ్ తరహాలో ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లను ప్రకటించింది బీజేపీ. రేవా ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మందసౌర్ ఎమ్మెల్యే జగదీశ్ దేవ్డాను ఎంపికీ చేసింది. వీరిద్దరూ శివరాజ్ ప్రభుత్వంలో మంత్రులుగా సేవలందించారు. పబ్లిక్ రిలేషన్స్ మంత్రిగా రాజీవ్ శుక్లా, ఆర్థిక మంత్రిగా జగదీశ్ దేవ్డా పనిచేశారు. మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించారు. మొరెనాలోని దిమనీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అంతకుముందు ఆదివారం బీజేపీ పరిశీలకులుగా వచ్చిన హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటికి వెళ్లారు. వారిని శివరాజ్ ఆత్మీయంగా స్వాగతం పలికారు.
Madhya Pradesh Election Results 2023 in Telugu : తాజాగా జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి బంపర్ మెజార్టీతో విజయ దుందుభి మోగించింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించి భారీ మెజార్టీ సాధించింది. మొత్తం 230 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 66 సీట్లు గెలవగా, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 18ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాషాయపార్టీ మూడింట రెండొంతులకుపైగా విజయం దిశగా దూసుకెళ్లింది.