ప్రేమించిన అబ్బాయి కోసం మతం మార్చుకుంది ఓ యువతి. మత కారణాల దృష్ట్యా పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడం వల్ల మతాన్ని మార్చుకుంది. మత మార్పిడి చేసుకున్న అనంతరం ప్రియుడిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ హిందూ సంప్రదాయంలో గాయత్రీ గుడిలో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు.
ప్రియుడితో పెళ్లి కోసం మతం మార్చుకున్న ప్రియురాలు.. వేదమంత్రాలతో ఘనంగా పెళ్లి - మధ్య ప్రదేశ్‌లో మత మార్పిడితో వివాహం చేసుకున్న జంట
ప్రేమ కోసం మత మార్పిడి చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సోషల్ మీడియా ద్వారా ప్రేమలో పడిన ఓ జంట వివాహం చేసుకునేందుకు మత గోడలు అడ్డుగా నిలిచాయి. దీంతో మత మార్పిడి చేసుకుని వివాహం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గుణ జిల్లాకు చెందిన నజ్నియా బానో అనే యువతి, కుంభరాజ్ నివాసి దీపక్ గోస్వామితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వీరి పరిచయం స్నేహంగా మారి, ప్రేమకు దారి తీసింది. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ యువతి ముస్లిం మతస్థురాలు కాగా.. యువకుడు హిందూ సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. దీంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. వీరి వివాహానికి మతం అడ్డుగోడగా నిలిచింది. దీంతో ఆ యువతి మత మార్పిడి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం గాయత్రీ టెంపుల్లో హిందూ మత గురువైన మణి మోహన్ చైతన్య సమక్షంలో మత మార్పిడి చేసుకుని వివాహం చేసుకుంది. మత గురువు ఆమె పేరు నజ్నియా బానో నుంచి నాన్సి గోస్వామిగా మార్చారు.
అయితే మత మార్పిడి చేసే ముందు మత గురువు చట్టపరమైన అన్ని ఆచారాలను పూర్తిచేశారు. వివాహం చేసుకున్న అనంతరం ఆ యువతి తమకు భద్రత కల్పించమని పోలీసులను అభ్యర్థించింది. మతం మార్చుకున్న నేపథ్యంలో తనకు ముస్లీంల నుంచి ఆపద పొంచి ఉందని తెలిపింది. తమ గ్రామానికి వెళ్లేందుకు భయంగా ఉందని.. పోలీసుల నుంచి భద్రత కల్పించమని కోరింది. అయితే ఈ ఆరునెలల కాలంలో మందసౌర్‌లో మూడు మతమార్పిడి కార్యక్రమాలు జరిగాయి. మహమ్మద్ నిసార్ అనే యువకుడు మత మార్పిడి చేసుకుని సోనూ సింగ్‌గా మారి రాణి అనే యువతిని హిందూ ఆచారాలతో వివాహం చేసుకున్నాడు.