Madhya Pradesh Election 2023 :2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు రానున్నాయి. అయితే రాష్ట్రంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. మరి రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితేంటి?
- మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 21
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 30
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2
- మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
- ఫలితాల లెక్కింపు తేదీ: డిసెంబర్ 3
Madhya Pradesh Election 2023 Date And Time : రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా అందులో బీజేపీకి 128 మంది సభ్యులు ఉన్నారు. విపక్ష కాంగ్రెస్‌కు 98 మంది బలం ఉంది. బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉండగా.. స్వతంత్రులు ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 114 గెలుచుకున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకుంది. మెజారిటీకి 116 మంది సభ్యులు అవసరం కాగా.. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. 15ఏళ్ల బీజేపీ పాలనకు అడ్డుకట్ట వేసి పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే, 2020 మార్చిలో అప్పటి కాంగ్రెస్ కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఆయనతో సహా 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ కమల్‌నాథ్ సర్కారు కూలిపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన నేతలంతా బీజేపీలో చేరారు.
Madhya Pradesh Election 2023 BJP : అయితే బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నాయకత్వపరంగా బలంగా ఉన్నప్పటికీ 2005 నుంచి వరుసగా నాలుగోసారి (2018 డిసెంబర్ 17 నుంచి 2020 డిసెంబర్ 23 వరకు మినహా) ఆ పదవిలో కొనసాగుతుండటం వల్ల సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఉమ్మడి నాయకత్వంలో వెళ్లడానికి ప్రయత్నించవచ్చనే భావన భాజపా వర్గాల్లో వ్యక్తమవుతూ వస్తోంది. అయితే కర్ణాటక ఫలితం నేపథ్యంలో చౌహాన్‌లాంటి బలమైన నాయకుడిని పక్కనపెట్టే సాహసం బీజేపీ నాయకత్వం చేయకపోవచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. అలా చేస్తే బలమైన ఓబీసీ నేతను పక్కన పెట్టారన్న అపవాదునూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కమల దళానికి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. అందువల్ల అధిష్ఠానం దూకుడుగా కాకుండా కొంత ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు ఎక్కుగా కనిపిస్తున్నాయి.
Madhya Pradesh Election 2023 Congress : మరోవైపు కర్ణాటక ఫలితం మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నిస్తుందనటంలో సందేహం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించి ఇతరుల సహాయంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో 15 నెలల్లోనే చేజారిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బీజేపీ నాయకత్వం అప్రజ్వామికంగా కూల్చేసిందన్న సానుభూతితో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర ఇక్కడ బాగానే సాగింది. దాన్ని చూసి రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ప్రకటించారు. కర్ణాటక తరహాలో స్థానిక అంశాలను ఎత్తిచూపే వ్యూహాన్ని ఇక్కడా అమలుచేసి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించొచ్చు.
Madhya pradesh Election 2023 Wiki : శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం కోసం తమ పథకాలను రచిస్తోంది. మరోవైపు, మెజారిటీ సీట్లు సాధించి గట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరి మధ్యప్రదేశ్ ఓటర్లు ఏం చేస్తారో చూడాలి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే పది అంశాలు ఇవే.
- నరేంద్ర మోదీ : ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ఆధిపత్యం చెలాయిస్తారు. బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తారు. మోదీ రాజకీయ ప్రసంగాలు, చరిష్మా, ప్రజాకర్షణపై బీజేపీ ఎక్కువగా ఆధారపడుతోందని చెప్పొచ్చు.
- అవినీతి, కుంభకోణాలు : బీజేపీ పాలనలో వస్తున్న అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ తమ ప్రధాన ఎన్నికల ప్రచార ప్రణాళికలో భాగం చేసుకోనుంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమిషన్ తీసుకుందని.. మధ్యప్రదేశ్‌లో 50 శాతం తీసుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 18 ఏళ్ల బీజేపీ పాలనలో 250కి పైగా కుంభకోణాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.
- అధికార వ్యతిరేకత: 2003 నుంచి ఇప్పటి వరకు 15 నెలల (డిసెంబర్ 2018-మార్చి 2020) మినహా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఉమ్మడి నాయకత్వంలో వెళ్లడానికి ప్రయత్నించవచ్చనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతూ వస్తోంది.
- సింధియా మద్దతుదారుల భవితవ్యం: 2020లో కాంగ్రెస్‌ను వీడి తనతో పాటు బీజేపీలో చేరిన తన మద్దతుదారులందరికీ అసెంబ్లీ టిక్కెట్లు దక్కేలా చూడడం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు చాలా కష్టతరమైన పనే!.. మరి వారంతే ఏం చేస్తారో చూడాలి.
- నేరాలు :రాష్ట్రంలో మహిళలు, దళితులపై నేరాలు పెరుగుతుండడం వల్ల ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
- ప్రాజెక్ట్ చీతా: రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలు చనిపోవడం వల్ల ఆ కార్యక్రమంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం 'ప్రాజెక్ట్ చిరుత'ను రూపొందించిన విధానాన్ని జంతు పరిరక్షకుల్లోని ఒక వర్గం.. అధికారులను ప్రశ్నిస్తోంది.
- రైతు సమస్యలు:రాష్ట్రంలో రైతుల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం, ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
- నిరుద్యోగం:మధ్యప్రదేశ్‌లో అధిక నిరుద్యోగ రేటు ఒక సవాలుగా మారింది. నిరుద్యోగ యువతను ఆకర్షించే ప్రయత్నంలో ఆప్.. అధికారంలోకి వస్తే భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, వారికి ఆర్థిక సాయం అందించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
- విద్య, ఆరోగ్యం: గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాఠశాలలు తెరిచినప్పటికీ అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అనేక ఆసుపత్రులలో తగినంత శిక్షణ పొందిన సిబ్బంది, వైద్యులు లేరు. దీంతో ఈ రెండు అంశాలు.. ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి.
- సీఎం అభ్యర్థి : కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థి కమల్నాథ్గా ఇప్పటికే ప్రకటించినా.. బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతోంది.