Madhya Pradesh Election 2023 :అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొన్న మధ్యప్రదేశ్‌లో శాసనసభ సమరానికి సర్వం సిద్ధమైంది. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ శాసనసభ బరిలో వివిధ పార్టీల తరఫున 2,533 మంది పోటీలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఆప్, జేడీయూ ఎన్నికల సమరంలో ఉన్నప్పటికీ.. పోటీ ప్రధానంగా కమలం, హస్తం పార్టీల మధ్యే నెలకొంది. ఇరుపార్టీల నేతలు అధికారం తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో మొత్తం 5,60,60,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,88,25,607 మంది, మహిళలు 2,72,33,9,45. థర్డ్ జెండర్ ఓటర్లు 1373 మంది ఉన్నారు. 230 స్థానాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. ఎన్నికల సంఘం 2049 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, దిండోరీలోని 4 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనుపమ్ రాజన్ తెలిపారు.
అభివృద్ధి పథకాలపై బీజేపీ ఆశలు!
మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని కమలం పార్టీ, ఈసారి పూర్తి మెజార్టీతో పాలనా పగ్గాలు చేపట్టాలని హస్తం పార్టీలు ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డాయి. అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీలు ఇచ్చాయి. భాజపా తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సహా మరికొందరు ప్రముఖులు ప్రచారం చేశారు. అభివృద్ధి నినాదంతోపాటు కేంద్రంలో మోదీ అమలు చేస్తున్న పథకాలను కమలం నేతలు ఏకరవు పెట్టారు.
కాంగ్రెస్ ఓబీసీ మంత్రం!
కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కులగణనతోపాటు మధ్యప్రదేశ్ జనాభాలో 48శాతం ఉన్న ఓబీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు హస్తం నేతలు హామీ ఇచ్చారు.