కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య శబరిమల ఆలయంలోకి ఇవాళ్టి నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. 2 నెలలపాటు కొనసాగే వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం ఆలయాన్ని ఆదివారంతెరిచారు. డిసెంబర్ 26 వరకు తెరిచే ఉంచనున్నారు. ఆలయ ప్రధాన పూజరి ఏకే సుధీర్ నంబూత్రి గర్భగుడి తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు.
ఈ ఉదయం నుంచి రోజుకు వెయ్యి మంది భక్తులను, వారాంతాల్లో 2వేల మందిని అయ్యప్పస్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులందరికీ కరోనా పరీక్ష నిర్వహించనుండగా 60ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. దగ్గు, జలుబు ఉన్నవారు, ఇటీవల కరోనా నుంచి కోలుకున్నవారు కూడా దర్శనానికి రావొద్దని శబరిమల ఆలయ మండలి సూచించింది.