Rahul Gandhi Lok Sabha Membership : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వేసిన అనర్హతను ఎత్తివేసినట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. రాహుల్ అనర్హత ఎత్తివేతతో దిల్లీలోని 10 జన్‌పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు మిఠాయిలు తినిపించుకున్నారు. ఖర్గే స్వయంగా నేతలు అందరికీ స్వీట్లు తినిపించారు. రాహుల్‌పై అనర్హతను ఎత్తివేస్తూ సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని మల్లికార్జున ఖర్గే స్వాగతించారు. దేశ ప్రజలకు, ముఖ్యంగా వయనాడ్ ప్రజలకు ఇదో గొప్ప ఊరటని అన్నారు.
Modi Surname Remark By Rahul Gandhi : 2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై గుజరాత్‌లో కేసు నమోదు కాగా ఈ ఏడాది మార్చి 23న సూరత్‌లోని సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది.