తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నియంత', 'జుమ్లాజీవి', 'సిగ్గు చేటు'... పార్లమెంట్​లో ఈ పదాలు నిషిద్ధం! - పార్లమెంట్ జుమ్లాజీవి నిషేధ పదాలు

Parliament banned words: పార్లమెంట్​లో ఉపయోగించకూడని పదాల జాబితాను లోక్​సభ సెక్రెటేరియట్ విడుదల చేసింది. 'జుమ్లాజీవి', 'సిగ్గు చేటు', 'హిపోక్రసీ', 'నియంత' వంటి పలు పదాలను ఉపయోగించకూడదని బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ వాదనల్ని లోక్​సభ స్పీకర్ తోసిపుచ్చారు.

LIST OF BANNED WORDS PARLIAMENT
LIST OF BANNED WORDS PARLIAMENT

By

Published : Jul 14, 2022, 11:43 AM IST

Updated : Jul 14, 2022, 6:06 PM IST

Parliament banned words: పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. ఇందుకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియెట్‌ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్‌ విడుదల చేసింది. ఇకపై 'జుమ్లాజీవి', 'కొవిడ్ స్ప్రెడర్‌', 'స్నూప్‌ గేట్‌' వంటి పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతో పాటు అతి సాధారణంగా ఉపయోగించే 'సిగ్గు చేటు', 'వేధించడం', 'మోసగించడం', 'అవినీతిపరుడు', 'డ్రామా', 'హిపోక్రసీ', 'నియంత' అనే పదాలను కూడా ఉపయోగించకూడదని బుక్‌లెట్‌లో పేర్కొనడం గమనార్హం.

జులై 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో నిషేధిత పదాల జాబితాను లోక్‌సభ విడుదల చేసింది. తాజా జాబితా ప్రకారం.. 'శకుని', 'తానాషా', 'వినాశ పురుష్‌', 'ఖలిస్థానీ', 'ద్రోహ చరిత్ర', 'చంచా', 'చంచాగిరి', 'పిరికివాడు', 'క్రిమినల్‌', 'మొసలి కన్నీళ్లు', 'గాడిద', 'అసమర్థుడు', 'గూండాలు', 'అహంకారి', 'చీకటి రోజులు', 'దాదాగిరి', 'లైంగిక వేధింపులు', 'విశ్వాసఘాతకుడు' వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగంలో ఉపయోగించకూడదు.
సమయానుకూలంగా కొన్ని పదాలు, హావభావాలను పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రాల చట్టసభల్లో వినియోగించకుండా వాటిని అమర్యాదకరమైనవిగా ప్రకటిస్తుంటారు. రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.

'నేను మాట్లాడుతా.. కావాలంటే సస్పెండ్‌ చేయండి'
లోక్‌సభ సెక్రటేరియట్‌ విడుదల చేసిన తాజా జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ మండిపడ్డారు. తాను వాటిని ఉపయోగిస్తానని, అవసరమైతే సస్పెండ్‌ చేసుకోవచ్చని సవాల్ చేశారు. ''మరికొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎంపీలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి మేం ప్రసంగించేటప్పుడు సిగ్గుచేటు, వేధింపులు, మోసం, అవినీతి, అసమర్థుడనే సాధారణ పదాలను కూడా వాడకూడదంట. నేను ఆ పదాలను ఉపయోగిస్తాను. కావాలంటే సస్పెండ్‌ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడతా'' అని ఓబ్రెయిన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

తోసిపుచ్చిన స్పీకర్
విపక్ష నేతల విమర్శల నేపథ్యంలో లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. "ఏ పదాల్నీ నిషేధించలేదు. సభ్యులు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు. ఆ హక్కును ఎవరూ హరించలేరు. కానీ.. ఏం చేసినా సభా మర్యాదలకు లోబడే ఉండాలి. విపక్షంతో పాటు అధికార పక్ష సభ్యులు వాడే పదాలూ ఇందులో ఉన్నాయి. రికార్డుల నుంచి తొలగించాల్సిన పదాల జాబితా రూపొందించడం 1954 నుంచి వస్తున్న ఆనవాయితీ. సభా సంప్రదాయాలు తెలియని వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని అన్నారు ఓం బిర్లా.

ఇదీ చదవండి:

Last Updated : Jul 14, 2022, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details