Amit shah on gujarat riots 2002: పరమ శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ అల్లర్లపై ఏఎన్‌ఐ ఇంటర్య్వూలో మాట్లాడిన మంత్రి అమిత్‌షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేశాయని ఆరోపించారు. ఆ బాధను ప్రధాని మోడీ భరిస్తుండటం తాను దగ్గరగా చూశానని అన్నారు. గుజరాత్ అల్లర్లలో మోదీకి క్లీన్‌చిట్ ఇవ్వడం శుభపరిణామం అన్నారు. సిట్ విచారణను తాము ప్రభావితం చేయలేదని.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని చెప్పారు. ఈ కేసు భాజపా ప్రతిష్ఠను దెబ్బతీసిందని.. కానీ ఇప్పుడదంతా తొలగిపోయిందన్నారు.
"తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లపాటు ఒక్క మాట మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్లుగా ఆ బాధను భరించారు. ఆ వేదనను నేను ఎంతో దగ్గరగా చూశాను. ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్ల ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటేనే అలా నిశ్శబ్దంగా ఉండటం సాధ్యం"
-అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి
అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత ఈడీ విచారణకు హాజరవుతోన్న తీరును తీవ్రంగా నిరసించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతోన్న ఆయనకు మద్దతుగా కేంద్రంపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. 'సిట్ ముందు హాజరయ్యేప్పుడు మోదీ ఎలాంటి హడావుడి చేయలేదు. విచారణను నిరసిస్తూ ధర్నా చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు ఇవ్వలేదు. ఆనాడు సీఎం స్థాయిలో ఉన్నా విచారణకు సహకరించారు. ఆ అల్లర్ల సమయంలో అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదు. కానీ దిల్లీలో చాలామంది సిక్కులను చంపివేశారు. కానీ ఒక్క అరెస్టు చేయలేదు. మేము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని వారు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు. నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ ఆ ఆరోపణలన్నీ రాజకీయపూరితమైనవని కోర్టు కూడా చెప్పింది' అని తెలిపారు.