కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను అభినందిస్తూ కేరళ విద్యార్థిని లిడ్వినా జోసెఫ్... నిజాయతీ, నిర్భీతి సహజ లక్షణాలుగా న్యాయవ్యవస్థ విలువలు, ప్రమాణాలు, విశిష్ట గౌరవాన్ని కాపాడుతూ దేశ ప్రజలందరికీ సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ విద్యార్థి పొట్లూరి దర్శిత్ అచ్చ తెలుగులో రాసిన లేఖలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అబ్బురపడ్డారు. వారి స్ఫూర్తిని అభినందిస్తూ తిరుగు లేఖలను పంపారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను కేరళ బాలిక గమనిస్తున్న తీరు, మహమ్మారి సమయంలో ప్రజల యోగక్షేమాల గురించి ఆమె వ్యక్తం చేసిన భావన తనను ఎంతో ప్రభావితం చేసిందని ఆయన పేర్కొన్నారు. చక్కని తెలుగులో దర్శిత్ రాసిన లేఖ తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందంటూ... శుభాశీస్సులు తెలుపుతూ ప్రత్యుత్తరం పంపారు.
నాకు గర్వంగా ఉంది: లిడ్వినా
కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్రత సమయంలో జోక్యం చేసుకుని సకాలంలో ఆక్సిజన్ అందేలా చేసి ప్రజల ప్రాణాలను కాపాడినందుకు కేరళకు చెందిన 5వ తరగతి చిన్నారి లిడ్వినా జోసెఫ్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసింది. న్యాయమూర్తులు తమ విధి నిర్వహణలో భాగంగా సుత్తితో కొట్టి వైరస్‌ను నిర్మూలిస్తున్నారని చాటుతూ గీసిన చిత్రంతో పాటు లేఖను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు ఆ విద్యార్థిని పంపింది. 'నాపేరు లిడ్వినా జోసెఫ్. కేరళ త్రిసూర్‌లోని కేంద్రీయ విద్యాలయలో 5వ తరగతి చదువుతున్నాను. నేను దేశానికి సంబంధించిన ప్రధాన వార్తలను హిందూ పత్రికలో చదివాను. కరోనా కారణంగా దిల్లీతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న మరణాలు నన్ను ఆందోళనకు గురిచేశాయి. సాధారణ ప్రజల మరణాలు, కష్టాలను చూసి కోర్టు సమర్థంగా జోక్యం చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి నాకు అర్థమైంది. కోర్టు సకాలంలో ఆక్సిజన్ సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేసి ఎంతోమంది ప్రాణాలను రక్షించడం నాకు గర్వంగా ఉంది. ఇందుకు మీకు ధన్యవాదాలు చెబుతున్నా. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా' అని ఆ చిన్నారి లేఖలో పేర్కొంది.