తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని పోలీస్ స్టేషన్​లోనే కత్తితో మెడపై.. - ఆన్​లైన్ గేమ్​లో డబ్బులు పోయానని ఆత్మహత్య

ఇద్దరు యువతులు కలిసి జీవించాలనుకున్నారు. అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడం వల్ల ఓ యువతి బ్లేడుతో మెడ, చేతిపై దాడి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. మరోవైపు, తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిని హత్య చేశాడు ఓ యువకుడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

lesbian couple in tamil nadu
ఇద్దరు యువతుల మధ్య ప్రేమాయణం

By

Published : Nov 10, 2022, 4:37 PM IST

సాధారణంగా ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ పుడుతుంది. అయితే తమిళనాడు ధర్మపురిలో ఓ వినూత్న ప్రేమ జంట దర్శనమిచ్చింది. ఇద్దరు అమ్మాయిల మనసులు కలిసి.. వారి మధ్య ప్రేమ చిగురించింది. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమికులు. ఒక్కటిగా కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఏం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎర్కోల్‌పట్టికి చెందిన శివప్రకాశ్​ తన కుమార్తె సబిల(21) కనిపించడం లేదని పెన్నాగారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సబిల.. కోయంబత్తూరులో ఉన్న ఆమె స్నేహితురాలు ధరణ్య(22)ను కలిసేందుకు వెళ్లిందని పోలీసులకు తెలిసింది. పోలీసులు ఇద్దరు యువతులను బుధవారం అదుపులోకి తీసుకుని.. కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని.. కలిసే జీవిస్తామని యువతులు పోలీసులకు తెలిపారు. అనంతరం మనస్తాపానికి గురైన ధరణ్య.. పోలీస్ స్టేషన్​లోని టాయిలెట్​లోకి వెళ్లి బ్లేడుతో కుడి చేయి, మెడపై దాడి చేసుకుంది. హుటాహుటిన పోలీసులు ధరణ్యను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స నిమిత్తం ధర్మపురి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ధరణ్య.. నంగవల్లి ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేసింది. కోయంబత్తూరులోని ఓ కాలేజీలో చదువుతున్నప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలిసి సబిల కుటుంబ సభ్యులు ఆమెను గత రెండు నెలలుగా కాలేజీకి పంపలేదు. అయితే అక్టోబరు 30 వ తేదీన ధరణ్యను చూసేందుకు సబిల కోయంబత్తూరుకు వెళ్లింది.

పెళ్లికి నిరాకరించిందని..
పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిని హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో బుధవారం జరిగింది. మృతురాలిని శ్వేతా విజయ్(26)​గా పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రతీక్ కిసాన్ (27)పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో బంధువుల పెళ్లిలో నిందితుడు ప్రతీక్‌కు.. శ్వేత పరిచయమైంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కొద్దిరోజుల వరకు భాగానే ఉన్న ప్రతీక్​.. ఆ తర్వాత శ్వేతను వేధించడం ప్రారంభించాడు. ఫోన్​ చేసి బెదిరించేవాడు. ప్రతీక్​ను పెళ్లి చేసుకునేందుకు శ్వేత నిరాకరించింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే ప్రతీక్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ వేధించేవాడు. ఈ ఘటనపై చతుర్శింగి పోలీస్ స్టేషన్​లో బాధితురాలు రెండు నెలల కిందట ప్రతీక్​పై ఫిర్యాదు చేసింది.

మృతురాలు శ్వేత

బుధవారం మధ్యాహ్నం శ్వేత తన తల్లి దీపాలితో కలిసి బైక్‌పై బయటకెళ్లి ఇంటికి రాగా.. నిందితుడు ఆమెపై కత్తితో మెడ, ఛాతీ, కడుపుపై దాడి చేశాడు. ఈ క్రమంలో శ్వేత తీవ్ర గాయాలపాలైంది. హుటాహుటిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతురాలు శ్వేత.. ప్రస్తుతం సీఏ చదువుతోంది. ఆమె తండ్రి మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఆమె తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తోంది. సీఏ కోర్సు పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంది. అయితే అంతలోపే అనంతలోకాలకు వెళ్లిపోయింది. నిందితుడు ప్రతీక్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం.

ఆన్​లైన్​ గేమ్​లో డబ్బులు పోయాయని..
ఆన్​లైన్​ గేమ్​లో డబ్బులో పోయాయని మనస్తాపానికి గురయ్యాడు ఓ కాలేజీ యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని మైలాపుర్​లో జరిగింది. మృతుడిని చరణ్(22)గా పోలీసులు గుర్తించారు. అతడి స్వస్థలం ధర్మపురి అని తెలిపారు.​ స్నేహితులతో కలిసి మైలాపూర్​లో అద్దె ఇంటిలో చరణ్ నివసిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడు గోల్డ్ కాయిన్ అనే ఆన్​లైన్ గేమ్​లో డబ్బులు పోగోట్టుకోవడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిందీ ఘటన.

హత్యను ప్రమాదంగా మార్చే కుట్ర..
మహారాష్ట్ర పాల్ఘర్​లో దారుణం జరిగింది. 28 ఏళ్ల ఆటో డ్రైపర్​ను పొరుగింటి వ్యక్తి హత్య చేశాడు. అనంతరం ఈ మృతిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బాధితుడు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు వెళ్లగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం జరిగిందీ ఘటన.

తన భర్తపై గోడ కూలి మరణించినట్లు అతడి భార్యకు సమాచారం అందింది. వెంటనే ఆమె ఘటనాస్థలికి చేరుకుని.. శిథిలాల కింద ఉన్న తన భర్త మృతదేహాన్ని పరిశీలించింది. తన భర్త ముఖంపై ఒక్క గాయం కూడా లేకపోవడం వల్ల ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షలో బాధితుడి తలకు తీవ్ర గాయాలైనట్లు తేలింది. నిందితుడి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

తల్లిని చంపిన కుమారుడు..
మధ్యప్రదేశ్ భోపాల్​లో దారుణం జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి.. కన్నతల్లినే బలిగొన్నాడు. తన తల్లి మాంత్రికురాలని.. తన పెళ్లిని అడ్డుకుంటోందని ఆరోపించాడు. నిందితుడు అబ్దుల్ అహ్మద్ ఫర్హాన్​.. తన తల్లి ఫరూఖ్​(67)ను క్రికెట్ బ్యాట్​, ఇనుప రాడ్​ దాడి చేసి చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడు, ఆమె తల్లి మధ్య తరచుగా గొడవలు జరిగేవని వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫర్హాన్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు.

ఇవీ చదవండి:'నాన్నకు ప్రేమతో'.. లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె!

క్రికెటర్ భార్యకు భాజపా టికెట్.. మోర్బీ బాధితుల్ని కాపాడిన వ్యక్తికి ఛాన్స్

ABOUT THE AUTHOR

...view details