తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: బాబుల్‌ సుప్రియో

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు భాజపా ఎంపీ బాబుల్​ సుప్రియో. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

BJP leader Babul Supriyo
బాబుల్‌ సుప్రియో

By

Published : Jul 31, 2021, 5:48 PM IST

Updated : Jul 31, 2021, 6:02 PM IST

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ఇకపై సామాజిక సేవపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బాబుల్‌ను తొలగించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దిల్లీలో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన నివాసాన్ని కూడా నెల రోజుల్లో ఖాళీ చేస్తానని బాబుల్‌ వెల్లడించారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు.

"అల్విదా.. నేను టీఎంసీ, కాంగ్రెస్‌, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. ఆ పార్టీల్లోకి రమ్మని నన్నెవరూ ఆహ్వానించలేదు. నేను ఒకే టీం ప్లేయర్‌ని. ఎప్పటికీ ఒకే పార్టీ (భాజపా)లో ఉంటా. నా వల్ల కొంతమంది సంతోషపడ్డారు. మరికొందరు బాధపడ్డారు. ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఓ నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం సాధ్యం కాదు. నన్ను అపార్థం చేసుకోకండి" అంటూ బాబుల్‌ బెంగాలీలో రాసుకొచ్చారు.

ప్రముఖ గాయకుడైన బాబుల్‌ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసన్సోల్‌ నుంచి రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు.

అయితే, ఇటీవల బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బాబుల్‌ను కూడా బరిలోకి దించింది. అయితే టీఎంసీ అభ్యర్థి అరూప్‌ బిశ్వాస్‌ చేతిలో ఆయన పరాజయంపాలయ్యారు. దీంతో ఆయనపై భాజపా అధినాయకత్వం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగగా.. 12 మంది మంత్రులకు మోదీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అందులో బాబుల్‌ కూడా ఒకరు. మరోవైపు బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌తో ఈయనకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బాబుల్‌ పార్టీ వీడుతున్నట్టు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి:వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే దేశార్థికానికి శిరోధార్యం

Last Updated : Jul 31, 2021, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details