కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఎంతో చురుకైన వ్యక్తి అని కీర్తించారు.
"అహ్మద్ పటేల్జీ మరణించారని తెలిసి బాధపడ్డా. ప్రజా జీవితంలో ఆయన ఎన్నో ఏళ్లు గడిపారు. సమాజానికి సేవ చేశారు. ఆయన చురుకైన వ్యక్తి. కాంగ్రెస్‌ను బలోపేతం చేయటంలో ఆయన పాత్ర మరువలేనిది. అహ్మద్ కుమారుడు పైజల్తో మాట్లాడాను. అహ్మద్ జీ ఆత్మకు శాంతి చేకూరాలి."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
గొప్ప వ్యూహకర్త..
"అహ్మద్ పటేల్ మరణం తీవ్రంగా కలచివేసింది. ఆయన గొప్ప వ్యూహకర్త, చురుకైన నాయకుడు. పార్టీ శ్రేణుల్లో ఎందరో స్నేహితులను సంపాదించుకున్నారు."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
విలువైన ఆస్తి..
"ఇది చాలా విషాదకరమైన రోజు. అహ్మద్ కాంగ్రెస్ మూల స్తంభాల్లో ఒకరు. ఆయన బతికి ఉన్నంత వరకు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఆయనొక విలువైన ఆస్తి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మంచి స్నేహితుడిలా..
"అహ్మద్ జీ తెలివైన నాయకుడే కాదు.. నాకు ఎప్పుడు సహచరుడిలా సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నాకు అన్ని విషయాల్లో స్నేహితుడిగా ఉన్నారు. ఆయన మమ్మల్ని శూన్యంలో వదిలి వెళ్లారు."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మీడియాకు దూరంగా..
"అహ్మద్ పటేల్ ఇక లేరు. అత్యంత విశ్వసనీయ వ్యక్తి అయిన ఆయనతో నాకు ఎంతో కాలంగా సాన్నిహిత్యం ఉంది. మృదుభాషిగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయన చిరస్మరణీయులు. ఆయన వద్దకు ఎంత కోపంతో వెళ్లినా వారిని శాంతపరిచి పంపేవారు. మీడియాకు దూరంగా ఉండేవారు. కానీ, కాంగ్రెస్ తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలో ఆయన పాత్ర ఉండేది. చేదు మాటల్ని సైతం తీయని పదాలతో చెప్పే నేర్పరితనం ఆయనది. ఆయన అత్యంత ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి. నమాజ్ చేయడాన్ని ఎప్పుడూ మరిచేవారు కాదు. ఆయన సేవల్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మరువదు. ఆయన అమరుడు. అల్లా ఆశీస్సులతో ఆయనకు స్వర్గం ప్రాప్తించాలని ప్రార్థిస్తున్నాను.’’
- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
అహ్మద్ పటేల్‌కు కేసీఆర్ సంతాపం..
అహ్మద్ పటేల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అహ్మద్ పటేల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పటేల్‌కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సీఎం కేసీఆర్ ప్రకటించారు.
స్వగ్రామంలో అంత్యక్రియలు..
అహ్మద్ పటేల్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం గుజరాత్‌లోని పిరమణ్లో నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత