నిందితులను వేధించడానికి చట్టాన్ని సాధనంగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. అనవసరమైన కేసులు.. చట్టం పవిత్రతను దెబ్బతీయకుండా న్యాయస్థానాలు ఎల్లప్పుడూ చూసుకోవాలని వ్యాఖ్యానించింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని ఇద్దరు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితులపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పిన జస్టిస్ కృష్ణ మురారి, ఎస్ఆర్ భట్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. అమాయకులను రక్షించడానికి చట్టం ఒక కవచంగా ఉండాలని అభిప్రాయపడింది. అంతేగానీ నిందితులను బెదిరించడానికి ఆయుధంగా ఉండకూదని పేర్కొంది.
'నిందితులను వేధించడానికి చట్టాన్ని సాధనంలా ఉపయోగించకూడదు' - వ్యాపారవేత్త పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
నిందితులను వేధించడానికి చట్టాన్ని సాధనంగా వాడుకోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. అమాయకులను రక్షించడానికి చట్టం ఒక కవచంలా ఉపయోగపడాలని స్పష్టం చేసింది.
2013 నవంబర్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్.. ఓ వ్యాపారవేత్తకు చెందిన కెమికల్ కంపెనీపై దాడులు జరిపారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని 2016 మార్చిలో కంపెనీ యజమానికి షోకాజ్ మెమో జారీచేశారు. కాగా, తమపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయమని నిందితులు మద్రాస్ హైకోర్టును గతేడాది ఆగస్టులో ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను తిరస్కరణకు గురైంది. దీంతో వారిద్దరూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిల్‌పై జస్టిస్ కృష్ణ మురారి, ఎస్ఆర్ భట్‌లతో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. 2017లో వ్యాపారవేత్తపై కేసు నమోదైనట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రాథమిక విచారణకు, కేసు నమోదు చేయడానికి మధ్య నాలుగేళ్ల వ్యవధి ఉందని ధర్మాసనం ప్రస్తావించింది. ఆలస్యంగా నమోదు చేసిన ఫిర్యాదులోనూ సరైన ఆధారాలు లేవని పేర్కొంది. 'పిటిషన్‌ను కొట్టేయడానికి కేసు దర్యాప్తు ఆలస్యం కావడం కారణం కాదు. న్యాయపరంగా చివరివరకు నిలుస్తుందని అనుకున్నప్పుడే.. క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కానీ, నిందితులను వేధించడానికి చట్టాన్ని ఉపయోగించుకోవద్దు' అని సుప్రీంకోర్టు హితవు పలికింది.