Lakshadweep MP Disqualification : లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌కు మరోసారి తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దిగువ కోర్టు తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ ఫైజల్ చేసుకున్న అభ్యర్థనను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించడం వల్ల అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. 2023 జనవరి 11 నుంచి ఈ అనర్హత వర్తిస్తుందని వెల్లడించింది.
Lakshadweep MP Mohammed Faizal Case : అంతకుముందు హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్.. దిగువ కోర్టు తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. ఫైజల్ చేసుకున్న అభ్యర్థనను మంగళవారం తిరస్కరించింది. ఫైజల్‌కు, మరో ముగ్గురికి దిగువ కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిని సవాల్ చేస్తూ లక్షద్వీప్ పాలనా యంత్రాంగం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం తప్పుపడుతూ... ఆ తీర్పును కొట్టివేసింది.
అయితే, ఫైజల్ పార్లమెంటు సభ్యత్వం కోల్పోకుండా మూడు వారాల పాటు రక్షణ కల్పించింది. ఆయన పిటిషన్‌ను పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టును ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మంగళవారం తాజా నిర్ణయాన్ని వెలువరించింది. దిగువ కోర్టు విధించిన శిక్షను నిలిపివేసేందుకు నిరాకరించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియను నేరపూరితం చేయడం ఆందోళనకరమని జస్టిస్ ఎన్.నగరేశ్ ఉత్తర్వులో చెప్పారు. నేర నేపథ్యమున్న వ్యక్తులను చట్టసభల్లో ప్రవేశించడానికి అనుమతించరాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫైజల్ నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెబుతూ శిక్షను నిలిపివేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు.