ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారి వేధింపులకు తాళలేక ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని అడిగాడు లైన్మెన్ గోకుల్. అయితే, బదిలీ కావాలంటే డబ్బుతో పాటు గోకుల్ భార్య తనతో గడపాలని కోరాడు ఉన్నతాధికారి. దీంతో గోకుల్ మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది: లఖింపుర్ ఖేరికి చెందిన గోకుల్ యాదవ్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే, ఇండో-నేపాల్ సరిహద్దున ఉన్న ధాహాపుర్లో విధులు నిర్వర్తిస్తుండగా.. అలీగంజ్‌కు బదిలీ చేశారు. తన కుటుంబం పాలియాలో నివసిస్తుందని.. తిరిగి అక్కడికి బదిలీ చేయాలని కోరాడు గోకుల్ యాదవ్. కానీ అతడి అభ్యర్థనను జేఈ నాగేంద్ర శర్మ పట్టించుకోలేదు. బదిలీ కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని.. గోకుల్ భార్యను తనతో గడిపేందుకు పంపాలని కోరాడు నాగేంద్ర శర్మ. దీంతో మానసికంగా కలత చెందిన గోకుల్.. ఆదివారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. దీంతో నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని పవర్ కార్పోరేషన్ యూనియన్ డిమాండ్ చేసింది. కాగా, నాగేంద్ర శర్మతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న మరో లైన్మెన్ సస్పెండ్ చేస్తున్నట్లు డీఎం మహేంద్ర బహుదుర్ సింగ్ తెలిపారు.
డ్రగ్స్‌కు బానిసై సొంత ఇంటికే నిప్పు: డ్రగ్స్ కొనేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటికే నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో జరిగింది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఇల్లు ఇదీ జరిగింది:గంగ్నహర్ కోత్వాలి ప్రాంతంలోని రాంపూర్ గ్రామానికి చెందిన రాహుల్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డ్రగ్స్‌ను కొనేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లి సవితను అడగగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన రాహుల్.. గ్యాస్ సిలిండర్‌తో ఇంటికి నిప్పంటించాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దారి చిన్నగా ఉండటం వల్ల అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకోలేకపోయింది. దీంతో ఇంట్లోని సామాన్లన్నీ కాలి బూడిదయ్యాయి. బకెట్ల సాయంతో స్థానికులే మంటలను ఆర్పేశారు.
క్షుద్రపూజలు చేస్తుందన్న అనుమానంతో: ఉత్తర్‌ప్రదేశ్ రూర్కీ లిబర్హెడి గ్రామంలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తుందన్న అనుమానంతో మహిళను దారుణంగా కొట్టారు గ్రామస్థులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది: మంగళూరు కోత్వాలి ప్రాంతంలోని లిబర్హెడి గ్రామానికి వచ్చింది ఓ మహిళ. ఆమెతో మాట్లాడుతుండగా.. గ్రామానికి చెందిన మహిళ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఇంట్లో ఉన్న మహిళను విచారించారు. ఆమె బ్యాగులో తనిఖీ చేయగా.. క్షుద్రపూజ సామగ్రి, ఓ జంతువు ఎముక కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు..ఆమెపై దాడి చేశారు. మరోసారి గ్రామానికి రావద్దని హెచ్చరించి వదిలిపెట్టారు. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వైరల్‌గా మారింది. ఇదీ చదవండి:మళ్లీ డ్రగ్స్ కలకలం.. రూ.60కోట్ల సరకు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్