KRMB Meeting in Hyderabad Today : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ ఛైర్మన్ నందన్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. సమావేశం కోసం భారీ ఎజెండా సిద్ధమైంది. బోర్డుతో పాటు రెండు రాష్ట్రాలు ప్రతిపాదించిన మొత్తం 21 అంశాలను ఎజెండాలో పొందపరిచారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకం ప్రధాన అంశంగా ఉంది.
సమావేశంలో చర్చకు రానున్న ప్రధానాంశాలివే :గతం నుంచి కొనసాగుతున్నట్లుగానే 811 టీఎంసీలను 66:34 నిష్పత్తిలో పంచాలని ఏపీ అంటోండగా.. అది తమకు ఆమోదయోగ్యం కాదని.. చెరి సగం వాటా ఉండాలని తెలంగాణ అంటోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, ఉమ్మడి కాంపోనెంట్లను బోర్డుకు స్వాధీనం చేయడం, అనుమతుల్లేని ప్రాజెక్టుల అంశం కూడా చర్చకు రానుంది. దీంతో పాటు బోర్డు బడ్జెట్, కేఆర్ఎంబీ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన అదనపు అలవెన్స్ రికవరీ, సంబంధిత అంశాలు కూడా చర్చకు రానున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడం లేదంటున్న బోర్డు... కార్యకలాపాలు సజావుగా సాగాలంటే జూన్‌లోగా నిధులు విడుదల చేయాలని కోరుతోంది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం, రాజభాష హిందీ అమలు, అందుకోసం అవసరమైతే అనువాదకుల నియామకం అంశం కూడా ఎజెండాలో ఉన్నాయి.