ప్రేమికులకు మరపురాని రోజు ఉందంటే అది వాలెంటైన్స్ డే. తమ భాగస్వామిపై ఉన్న ప్రేమను తెలియజేసేందుకు అందమైన పూలు, మధురమైన చాక్లెట్లు, ముద్దుగా ఉండే టెడ్డీ బేర్లు వాలెంటైన్స్ డే రోజున కానుకగా ఇస్తుంటారు. కానీ, ప్రేమంటే ఇంతేనా? ఈ వాలెంటైన్స్ డేకు ఉన్న ప్రత్యేకత.. చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడంతోనే సరిపోతుందా? కానే కాదు! ప్రేమంటే అంతకుమించి. ప్రియమైనవారిపై ఉన్న ఆప్యాయతను తెలియజేసేందుకు ఒక్కోసారి ఇవేవీ సరిపోవు. తమ జీవితంలో భాగమైనవారికి ఏది చేసినా తక్కువే అవుతుంది. గుజరాత్‌కు చెందిన ఈ జంట కూడా ఆ కోవకే చెందుతారు. ప్రేమంటే ఎంత గొప్పదో ప్రేమికుల రోజునే నిరూపించారు.
అది 2017 సంవత్సరం. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన విషయం 43 ఏళ్ల రీటా పటేల్‌కు అప్పుడే తెలిసింది. అప్పటి నుంచి కాళ్లు వాచిపోవడం, ఊపిరాడకపోవడం ఆవిడకు రోజువారి సమస్యలుగా మారిపోయాయి. కిడ్నీని మార్చడమే సమస్యకు పరిష్కారమని డాక్టర్లు సూచించారు. కానీ అలా చెప్పగానే ఇలా ఆపరేషన్ చేసేయడానికి కిడ్నీ అంగట్లో సరకేం కాదు కదా. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా 1.8 లక్షల మంది కిడ్నీ వైఫల్యాలతో బాధపడుతున్నారు. కానీ, కిడ్నీ దాతలు మాత్రం 6 వేలకు అటు ఇటుగా ఉంటున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ దొరకాలన్నా కష్టమే. ఇలాంటి కేసులు ఎప్పటికోగానీ రావు. ఒకవేళ వచ్చినా.. వాళ్ల కిడ్నీ సరిపోతుందో లేదో అన్న అనుమానాలు ఉంటాయి.