"దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే.. ప్రభుత్వ పెద్దల ఎత్తు" Key Information in Sunitha Petition: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ YS అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకూ అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను.. సుప్రీంకోర్టులో సవాలు చేసిన వివేకా కుమార్తె సునీత.. ఆ పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి పేర్లు వచ్చిన తర్వాతే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, అత్యంత ప్రభావశీల వ్యక్తులు వారిని రక్షించడానికి.. ముఖ్యంగా అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం, దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి.. ఎత్తులు వేయడం ప్రారంభించారని సునీత పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ శాసనసభ సాక్షిగా 2021 నవంబర్ 19న ఈ కేసులో ప్రధాన అనుమానితుడు అవినాష్ రెడ్డికి క్లీన్‌చిట్ ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది దర్యాప్తు ప్రక్రియను.. దెబ్బతీయడమే కాకుండా.. అనుమానితులు ఎప్పటికీ చిక్కరన్న సందేహాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో.. డి.శివశంకర్‌రెడ్డిని ఏ-5గా చేర్చిందని, కుట్రలో అవినాష్‌రెడ్డి పాత్ర గురించీ పేర్కొందని గుర్తుచేశారు. ఆధారాలు చెరిపేయడంలో పాల్గొన్న ఇతర నిందితుల పాత్రతోపాటు.. ఈ హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణం గురించి దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు.
కేబినెట్ ర్యాంకులో ఉన్న.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వంలో అత్యంత కీలక వ్యక్తి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. గతేడాది ఫిబ్రవరి 15న విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసులో అనుమానితుడైన అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని పచ్చిగా సమర్థించడంతో పాటు, CBIపై నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. ఫిబ్రవరి 18., మార్చి 1వ తేదీల్లోనూ.. దర్యాప్తును పక్కదోవ పట్టించేలా సజ్జల ఆరోపణలు చేశారని వివరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక సిట్ దర్యాప్తును నీరు గార్చింది: మరో వైపు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్‌ను నీరుగార్చిందని.. పిటిషన్‌లో వివరించారు. హత్య జరిగిన రోజు అప్పటి ప్రభుత్వం.. సీఐడీ అదనపు డీజీపీ హోదా గల ఇద్దరు ఐపీఎస్ ర్యాంకు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ఒక ఓఎస్డీ, ఇతరులతో కలిపి.. సిట్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అయితే వైసీపీ తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిందన్నారు. 2019 మార్చి 19న.. జగన్ అందుకోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి.. సీఎం అయ్యాక దాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.
మార్చి 22న తన తల్లితో కలిసి.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించామని సునీత గుర్తుచేశారు. ఆ సమయంలో.. ఈ దారుణ హత్యలో ఎవరు పాల్గొన్నారో తెలియదని, కుటుంబ సభ్యులు.., వారి అనుచరులకు ఇందులో పాత్ర ఉంటుందని ఊహించలేదన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నవారు.. తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తుండటంతో.. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అలా చేస్తున్నారని భావించామన్నారు. అయితే ఎన్నికలు జరిగి జగన్ సీఎం అయ్యాక సిట్‌ను మార్చారని.. ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, 8 మంది ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లను.. అందులో సభ్యులుగా చేర్చారని తెలిపారు. సిట్‌కు కడప ఎస్పీని అధిపతిని చేసి.. దాని స్థాయిని నీరుగార్చారని వివరించారు.
2019 మార్చి 28న ముగ్గురు నిందితులు అరెస్టయిన తర్వాత.. 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో.. వారికి బెయిల్ మంజూరైందన్నారు. 2019 అక్టోబర్ 10న మూడోసారి సిట్‌ను మార్చి కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి సిట్ బాధ్యతలు అప్పగించారని.. తర్వాత కేసు దర్యాప్తులో పురోగతే కనిపించలేదని వివరించారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో అవినాష్ రెడ్డిని.. ఈ నెల 25 వరకూ అరెస్ట్ చేయొద్దని.. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల దర్యాప్తు పట్టాలు తప్పే ప్రమాదం ఏర్పడిందని.. ఆ ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు.
సోమవారానికి విచారణ: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులు చాలా దారుణం.., ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని... వ్యాఖ్యానించారు. అవి అమల్లో ఉండటానికి వీల్లేదని, వాటిపై స్టే ఇస్తున్నామని స్పష్టం చేశారు. హైకోర్టులో ఈ కేసు.. మంగళవారం విచారణకు వస్తుందని సునీత తరఫు న్యాయవాది సీజేఐ దృష్టికి తీసుకెళ్లగా.. హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తామని స్పష్టం చేశారు. అవినాష్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన.. సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్.. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని, తాము వాదనలు వినిపిస్తామని కోరారు. తన వద్ద హైకోర్టు ఉత్తర్వులు తప్ప.. పిటిషన్ కాపీ లేదని రంజిత్‌కుమార్ చెప్పగా.. ఆయనకు పిటిషన్ కాపీ అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
అలా చేస్తే అవినాష్‌ను వెంటనే అరెస్టు చేస్తారు: అయితే హైకోర్టు ఉత్తర్వులపై.. స్టే ఇస్తామనడంపై.. అవినాష్‌రెడ్డి న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్‌ను సీబీఐ కార్యాలయంలో విచారిస్తున్నారని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే.. సీబీఐ వెంటనే ఆయన్ను.. అరెస్ట్ చేస్తుందన్నారు. హైకోర్టు ఇచ్చింది దారుణమైన ఆర్డర్ అన్న CJI.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. మధ్యంతర ఉత్తర్వులు, హైకోర్టులో తదుపరి కార్యాచరణపై.. స్టే ఇస్తున్నమని స్పష్టం చేశారు. హైకోర్టులో తదుపరి కార్యాచరణపై స్టే ఇస్తే ఇబ్బంది లేదని, మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే.. పిటిషనర్ SLPని అనుమతిచ్చినట్లు అవుతుందని..తమకు ఎలాంటి అవకాశం లేకుండా పోతుందని రంజిత్‌కుమార్ చెప్పారు. ఫలితంగా... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లోని పేరా 18లో జారీ చేసిన నిర్దేశాలపై స్టే జారీ చేస్తున్నామని.. CJI స్పష్టం చేశారు. సోమవారం వరకు అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయొద్దని ఆదేశించారు.
ఇవీ చదవండి: