కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెరుగుతున్న రోజువారీ కేసులను అదుపుచేయడానికి పోరాడుతున్న వైద్య అధికారులకు.. జికా వైరస్ రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది.
అంటువ్యాధిని అదుపుచేయడంలో సఫలమై.. గతేడాది 'కేరళ మోడల్' గా ప్రశంసలు పొందిన రాష్ట్రంలో.. ప్రస్తుతం రోజుకు సరాసరి 12 నుంచి 15 వేల మధ్య కేసులు నమోదవుతున్నాయి. దీనిని 'దీర్ఘకాల ఉప్పెన'గా నిపుణులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో శనివారం నమోదైన 14,087 కొత్త కేసులతో వ్యాధిగ్రస్థుల సంఖ్య 30,39,029కి పెరిగింది. మరో 109 మరణాలతో వైరస్‌కు బలైన వారి సంఖ్య 14,380కు చేరింది. ప్రస్తుతం 1,13,115 యాక్టివ్ కేసులున్నాయి.
అన్‌లాక్ చర్యల కారణంగా వైరస్ కేసులు పెరిగాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఇటీవలే అన్నారు. త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని ఆమె చెప్పారు.
జూన్ 1న రాష్ట్రంలో 19,760 పాజిటివ్ కేసులు బయటపడగా.. కాస్త తగ్గుతూ వచ్చి జూన్ 7న 9,313 కేసులు నమోదయ్యాయి. తర్వాత రెండు రోజులకే అమాంతం 16,204కు పెరిగాయి. ఆ నెలలో సరాసరి 11 నుంచి 13 వేల మధ్య కేసులు వెలుగుచూశాయి.
గతేడాది జనవరిలో తొలి కరోనా వైరస్ కేసు కేరళలోనే బయటపడటం గమనార్హం.
"కేసుల వృద్ధి స్థిరంగా కొనసాగితే వైరస్‌ను అదుపు చేయడం సులభమవుతుంది. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. దాంతో మూడో వేవ్ రాకుండా నిరోధించడం, కొత్త వేరియంట్లను కనుగొనడంలో వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి వీలవుతుంది. కానీ, అది దీర్ఘకాలం కొనసాగితే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై మరింత ఒత్తిడి నెలకొంటుంది." అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వైరస్ సంక్రమణ రేటు ఒక్కసారిగా పెరగకుండా నివారణ చర్యలు తీసుకున్న కేరళ ప్రభుత్వాన్ని పలువురు వైద్య నిపుణులు ప్రశంసిస్తుంటే.. అన్‌లాక్ తర్వాత నిబంధనల అమలులో వైఫల్యం కారణంగా కేసులు తగ్గడానికి బదులు పెరుగుతున్నాయని మరికొందరు విమర్శిస్తున్నారు. టీకా పంపిణీ ముఖ్యమని, వాటికోసం కేవలం కేంద్రంపై ఆధారపడకుండా ఎలాగైనా సేకరించి తీరాలని అంటున్నారు.
దీర్ఘకాల సాంక్రమణ రేటు సహా మూడో వేవ్ సంభవిస్తే పరిస్థితి దారుణంగా మారుతుందని డా.టీఎస్ అనీశ్ హెచ్చరించారు. రెండో దశలో కేసులు పెరగకుండా లాక్డౌన్ విధించి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ప్రభుత్వం చేయగలిగిందన్నారు. అయితే అన్‌లాక్‌తో మద్యం షాపుల వద్ద ప్రజలు గుమిగూడేందుకు అనుమతించడాన్ని ఆయన తప్పుబట్టారు.