Kerala Savaari: ఆన్‌లైన్ ట్యాక్సీ సేవల్లో సాధారణంగా ప్రైవేటు యాజమాన్యాలదే ఆధిపత్యం! ఈ క్రమంలోనే వాటికి పోటీ ఇచ్చేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. 'కేరళ సవారీ' పేరిట దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సేవలను ప్రారంభించారు. కేరళ సవారీ సేవలతో ప్రయాణికులు, డ్రైవర్లు.. ఇద్దరికి మేలు చేకూరుతుందని పేర్కొంటూ, 'కేరళ మోడల్' మళ్లీ మెరిసిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర కార్మిక మంత్రి వి.శివన్‌కుట్టి మాట్లాడుతూ.. 'నూతన సరళీకరణ విధానాలు సంప్రదాయ కార్మిక రంగాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. ఈ తరుణంలో మోటారు కార్మికులను ఆదుకునేందుకు కార్మికశాఖ ఆలోచించి అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది' అని తెలిపారు. తిరువనంతపురం మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు, దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరిస్తామని వెల్లడించారు.
ప్రత్యేకతలివి..
- 'కేరళ సవారీ'లో భద్రతాపరంగా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి డ్రైవర్‌కు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాప్‌లో అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం 'పానిక్ బటన్ సిస్టం' ఉంటుంది. డ్రైవర్ లేదా ప్రయాణికులు.. ఒకరికొకరు తెలియకుండా ఈ మీటను నొక్కవచ్చు.
- ప్రస్తుతం ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసు ప్రొవైడర్లు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ధరలకు, డ్రైవర్లకు చెల్లిస్తోన్న మొత్తానికి 20 నుంచి 30 శాతం వ్యత్యాసం ఉంది. పైగా.. ఆన్‌లైన్ టాక్సీ సేవల ఛార్జీలు సమయానుసారంగా మారతాయి. దీంతో డ్రైవర్లు నష్టపోతున్నారు. కానీ, 'కేరళ సవారీ'లో ఒకే ధర ఉంటుంది.
- ఇతర ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలతో పోలిస్తే కేవలం ఎనిమిది శాతం మాత్రమే సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తారు. దీంతో ఇది ఇతర ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలతో పోలిస్తే చౌకగా ఉంటుంది. వచ్చే ఆదాయాన్ని పథకం అమలుకు, ప్రయాణికులు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు వినియోగించనున్నారు.
- రాబోయే నెలల్లో.. అన్ని వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను అమర్చే ప్రణాళిక కూడా ఉంది. 24 గంటల కాల్ సెంటర్ తెరవనున్నారు. ఇప్పటికే తిరువనంతపురం మున్సిపాలిటీలో 500 మంది డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. డ్రైవర్లను టూరిస్ట్ గైడ్‌లుగా మార్చడం కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో ఓ భాగం.
- ఇంధన కొనుగోలు, బీమా తదితరవాటిపై డిస్కౌంట్ అంశం పరిశీలనలో ఉంది. వాహనాల ప్రకటనల ద్వారా మరింత ఆదాయం చేకూరేలా ప్రణాళిక ఉంది. అడ్వర్టైజింగ్ ఆదాయంలో 60 శాతం డ్రైవర్లకు చెల్లిస్తారు.
ఇవీ చదవండి:మిర్రర్ రైటింగ్‌లో యువతి ప్రతిభకు రికార్డులు దాసోహం
కోర్టు నుంచి రేప్ కేసు నిందితుడు పరార్, కొట్టి చంపిన స్థానికులు