కరోనా విజృంభణతో అతలాకుతలమైన కేరళ.. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 11,196 కేసులు వెలుగు చూశాయి. మరో 149 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో 18,849 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు..
- మహారాష్ట్రలో కొత్తగా 2,844 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 3,029 మంది కోలుకోగా,60 మంది వైరస్‌కు బలయ్యారు.
- తమిళనాడులో కొత్తగా 1,630 కేసులు నమోదయ్యాయి. 1,643 మంది కోలుకోగా, 17 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో కొత్తగా 629 కేసులు నమోదు కాగా.. 782 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 17 మంది మరణించారు.
- బంగాల్లో కొత్తగా 708 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- మిజోరంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 324 మంది చిన్నారులు సహా మొత్తం 1,846 మంది కరోనా బారిన పడ్డారు. మరొకరు వైరస్‌కు బలయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో 34 మందికి వైరస్ సోకగా.. మరో ఇద్దరు మరణించారు.
ఆంక్షలు పొడిగింపు..
మరోవైపు.. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను అక్టోబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం మంగళవారం తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ మేరకు మంగళవారం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.
రానున్న పండుగ రోజుల్లో ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అజయ్ భల్లా ఆదేశించారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో సంబంధిత అధికారులు.. కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని చెప్పారు. 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కరోనా నిబంధనలు పాటించడం' అనే ఐదు అంశాలపై దృష్టి సారించడం కొనసాగించాలని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ(Vaccination Status In India) కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 87.6 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 49 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.
ఇదీ చూడండి:'కథ ముగియలేదు.. సుదీర్ఘకాలంపాటు కరోనా వ్యాప్తి!'