Covid Restrictions: కరోనా మహమ్మారి దేశంలోని అనేక రంగాలను కోలుకోలేని దెబ్బకొట్టింది. పలురకాల వ్యాపారస్తులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కేరళలోని పర్యాటక బస్సు యజమానులు సైతం ఈ జాబితాలోకే చేరుతారు. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక బస్సులు నడవక భారీగా నష్టపోయి రోడ్డున పడ్డారు. దీంతో చేసేదేంలేక ఓ యజమాని తన బస్సులను తుక్కు కింద జమచేస్తూ.. కిలోల చొప్పున విక్రయించడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
కోచి కేంద్రంగా 'రాయ్' టూరిజం పేరుతో పర్యాటక బస్సులను నడిపే రాయ్‌సన్ జోసెఫ్ తనకున్న 20 బస్సుల్లో ఇప్పటికే పదింటిని విక్రయించాడు. వాటిని తుక్కుగా పరిగణిస్తూ కిలో రూ.45కే విక్రయించినట్లు జోసెఫ్ ఆవేదనకు గురయ్యాడు. కొవిడ్ కారణంగా ప్రయాణ ఆంక్షలతో తీవ్రంగా నష్టపోయానని, దిక్కుతోచని స్థితిలో తన బస్సులను అమ్మేస్తున్నట్లు వాపోయాడు. పలు నిబంధనలతో బస్సులు నడుస్తున్నప్పటికీ.. అంతంతమాత్రమేనని పేర్కొన్నాడు. గడిచిన వారంలో కేవలం మూడు బస్సులు మాత్రమే మున్నార్ ట్రిప్‌నకు వెళ్లినట్లు తెలిపాడు.