పుట్టిన పదిహేడు రోజుల నుంచే ఆ చిన్నారి ఓ అరుదైన వ్యాధిపై పోరాటం మొదలు పెట్టాడు. రూ.వేలు, రూ.లక్షల్లో కాదు రూ.కోట్లలో అయ్యే ఆ చికిత్స ఖర్చును భరించలేని తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూశారు. కొందరు దాతలు తమ వంతు సాయం అందించినా.. చికిత్సకు అయ్యే ఖర్చుకు అది సరిపోలేదు. ప్రభుత్వం సాయం అందిస్తుందని ఆశించారు. కానీ.. తాము ఏమీ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫలితంగా ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి ప్రాణాన్ని దక్కించుకోలేకపోయారు. కేరళలోని కోజికోడ్ ప్రభుత్వాసుపత్రిలో స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల ఇమ్రాన్.. మంగళవారం కన్ను మూశాడు.
ఖరీదైన వైద్యం..
మలప్పురం జిల్లా పెరింతలమన్నా పట్టణానికి చెందిన ఆరిఫ్‌కు కొన్ని నెలల క్రితం ఇమ్రాన్ జన్మించాడు. చిన్నారి.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ (Spinal Muscular Atrophy) వ్యాధితో బాధపడుతున్న ఇమ్రాన్‌కు చికిత్స అందించాలంటే రూ.కోట్ల ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇమ్రాన్‌కు జబ్బు నయం కావాలంటే జోల్గెన్జామా ఓనాసెమ్నోజీనీ (Zolgensma Onasemnogene) అనే ఇంజెక్షన్ అవసరం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఔషధాల్లో ఇదొకటి. విదేశాల్లో మాత్రమే లభించే ఈ ఇంజెక్షన్ ఒక్కో డోసు ధర రూ. 18 కోట్లు. వైద్యానికి అయ్యే ఖర్చును భరించే స్తోమత లేని ఇమ్రాన్ తల్లిదండ్రులకు దాతలు అండగా నిలిచారు. అంతా కలిసి రూ.16.5 కోట్లు సమీకరించారు. మరో కోటిన్నర సమీకరించగలిగితే.. ఇమ్రాన్ చికిత్స విషయంలో అంతా అనుకున్నట్టు జరిగేది.