కేరళకు చెందిన తొమ్మిదేళ్ల విఘ్నాజ్ క్రికెట్లో అద్భుతమైన షాట్లతో అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. బ్యాట్‌తోనే కాదు, వికెట్తోనూ బంతిని గురిచూసి బాదుతూ ఔరా అనిపిస్తున్నాడు. వికెట్ చేత్తో పట్టుకుని ప్లాస్టిక్ బాల్‌తో అతడు సాధన చేసిన దృశ్యాలను.. తండ్రి ప్రజిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ ఫిదా అయింది. విఘ్నాజ్ బ్యాటింగ్ శైలి, నైపుణ్యం పరిశీలించి.. అతడి ప్రతిభకు మరింత మెరుగులు దిద్ది.. అతడి ఉన్నత కెరీర్‌కు తమవంతు సహకారమందిస్తామంది.
ఇదీ చదవండి:ప్రోగ్రామింగ్‌ను ఆటాడుకుంటున్న ఏడేళ్ల బుడతడు!
బ్యాట్ విరిగినా.. ప్రాక్టీస్ ఆపలేదు..
త్రిస్సూర్ జిల్లాకు చెందిన విఘ్నాజ్ క్రికెట్‌పై తనకున్న మక్కువతో లూంగ్స్ క్రికెట్ అకాడమీలో చేరాడు. రోజూ సుమారు 5గంటల పాటు అక్కడ సాధన చేసేవాడు. కరోనా లాక్డౌన్ కారణంగా అకాడమీ మూతపడటం వల్ల.. వాళ్ల ఇంటి పైనే సాధన చేయడం ప్రారంభించాడు. అలా ప్రాక్టీస్ చేసే సమయంలో అతడి వద్దనున్న ఒక్కగానొక్క బ్యాట్ విరిగింది. స్పోర్ట్ షాపులు మూసి ఉన్నందున బ్యాట్ కొనలేకపోయాడు. అలా అని అతడు సాధన మాత్రం ఆపలేదు. బ్యాట్‌కు బదులుగా వికెట్‌ను ఉపయోగిస్తూ ప్రాక్టీస్ చేయడం కొనసాగించాడు.