Kerala Blast Today News :కేరళ.. కాలామస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఐఈడీ కారణంగా పేలుడు సంభవించినట్లుప్రాథమిక విచారణలో తేలిందని ఆ రాష్ట్ర డీజీపీ డా.షేక్ దర్వేశ్ తెలిపారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విచారణ తర్వాత ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందో లేదో చెప్తామన్నారు. దర్యాప్తు మాత్రం అన్ని కోణాల్లో జరుపుతున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"ఆదివారం ఉదయం 9.40 గంటలకు జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. 36మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమయంలో కన్వెన్షన్ సెంటర్‌లో క్రైస్తవ మతానికి చెందిన జెహోవా విట్నెసెస్ ప్రాంతీయ సమావేశం జరుగుతోంది. ఘటనాస్థలిలో సీనియర్ అధికారులంతా ఉన్నారు. సమగ్ర విచారణ జరుపుతున్నాం. పేలుడు వెనుక ఎవరు ఉన్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం"
-- డా.షేక్ దర్వేశ్ సాహెబ్, కేరళ డీజీపీ
కేరళకు ఎన్ఎస్జీ బృందం
కన్వెన్షన్ సెంటర్‌లో పేలుడుకు ఉపయోగించిన పదార్థాలను సేకరించి ఆరా తీసేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డు(NSG) బృందం.. దిల్లీ నుంచి బయలుదేరింది. ఒక అధికారితో సహా ఎనిమిది మంది సభ్యుల బృందం.. సాయంత్రానికి కేరళ చేరుకోనుంది. మరోవైపు, కేరళలో పేలుడు సంభవించిన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. భద్రతను పటిష్టం చేశారు. నిఘా సంస్థలతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు.
'దిగ్భ్రాంతికరమైన ఘటన'
కేరళలో పేలుడు ఘటనపై విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ స్పందించారు. "కొచ్చిలో క్రైస్తవ సంఘం ప్రార్థనా సమావేశంలో బాంబు పేలుడు ఘటన దిగ్భ్రాంతికరమైనది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా.. కేరళ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. నేను కూడా సీఎంతో మాట్లాడాను. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ఏజెన్సీలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను" అని తెలిపారు. ప్రార్థన సమయంలో కార్యక్రమానికి వచ్చిన వారంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగిందని రెవన్యూ శాఖ మంత్రి కె.రాజన్ తెలిపారు.
'అనాగరిక చర్యను ఖండించాలి'
కాలామస్సేరిలో పేలుడు ఘటనను మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. "మతపరమైన ప్రార్థనలో బాంబు పేలుడు వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనిని నేను ఖండిస్తున్నాను. సత్వరమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. మతపెద్దలు అందరూ ఏకమై ఈ అనాగరిక చర్యను ఖండించాలి" అని అన్నారు.
కన్వెన్షన్ సెంటర్‌లో పేలుడు వల్ల చెలరేగిన మంటలు