Kaushalendra IIT pass from jail: ఓ హత్య కేసుకు సంబంధించి 11 నెలలుగా జైలులో ఉంటున్నా ఆ కుర్రాడు భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు. చెరసాలలోనే శ్రద్ధగా చదివి మాస్టర్స్ డిగ్రీ కోర్సు కోసం ప్రతిష్టాత్మక ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఐఐటీ జామ్)లో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో 54వ ర్యాంకు సాధించి ఆశ్చర్యపరిచాడు. అతడే బిహార్‌కు చెందిన కౌశ్లేంద్ర కుమార్ అలియాస్ సూరజ్.
11 నెలలుగా జైలులో ఖైదీ.. అయినా ఐఐటీ పరీక్షలో టాప్ ర్యాంకర్! - Kaushalendra IIT qualified from jail
Kaushalendra IIT pass from jail: హత్య కేసు ఎదుర్కొంటున్నానన్న మానసిక ఒత్తిడి.. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియని దుస్థితి.. 11 నెలలుగా జైలులో నరకం.. అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు ఆ యువకుడు. కారాగారంలో ఉంటూనే లక్ష్యం కోసం శ్రమించాడు. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు సంపాదించాడు.
22 ఏళ్ల సూరజ్ సొంతూరు నవాడా జిల్లాలోని మోస్మా. గతేడాది ఏప్రిల్‌లో ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. మోస్మా గ్రామంలో డ్రైనేజీ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సంజయ్ యాదవ్ అనే వ్యక్తి మరణించాడు. ఈ కేసులో మరికొందరితోపాటు అరెస్టయిన సూరజ్.. నవాడా జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. అక్కడ ఉంటూనే చదువు కొనసాగించడంపై దృష్టిపెట్టాడు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నవాడా జైలులో 614 మంది ఖైదీలే ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నా.. అక్కడ 1000 మందికిపైగా ఉంటారు. ఇరుకైన గదులు, చుట్టూ ఖైదీలు, హత్య కేసును ఎదుర్కొంటున్నానన్న మానసిక ఒత్తిడి మధ్య ఐఐటీకి సిద్ధమయ్యాడు సూరజ్. ఫిబ్రవరి 13న జరిగిన ప్రవేశపరీక్ష రాశాడు. ఇటీవలే విడుదలైన ఐఐటీ రూర్కీ ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపి సీటు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు.
ఈ విజయాన్ని జైలు సూపరింటెండెంట్ అభిషేక్ కుమార్ పాండే, సోదరుడు వీరేంద్ర కుమార్‌కు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు సూరజ్. జైలులో ఉన్నా చదువు కొనసాగించేలా వారు తనలో ఎంతో స్ఫూర్తి నింపారని చెప్పాడు. శాస్త్రవేత్త కావాలన్నదే తన కల అని, అందుకే జైలు నుంచే పట్టుదలతో చదివి, పరీక్ష రాశానని వివరించాడు. ఐఐటీ-జామ్ పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఐఐటీలో ఎంఎస్సీలో చేరతారు.