కర్ణాటకకు చెందిన భరత్ (29) అనే యువకుడు.. తన మొదటి ప్రయత్నంలోనే టెలిస్కోప్ తయారు చేశాడు. ఖగోళశాస్త్రంమీద ఆసక్తితో, పలు పుస్తకాల సాయంతో భరత్.. కేవలం రూ.20 వేల ఖర్చుతో ఈ టెలిస్కోప్‌ను సిద్ధం చేశాడు. సొంతంగా చేసిన టెలిస్కోప్‌ను ఉపయోగించి సౌరవ్యవస్థలోని గ్రహాలను పరిశీలిస్తున్నట్లు భరత్ తెలిపాడు.
ఇదీ కథ..
29 ఏళ్ల భరత్ కర్ణాటక చామరాజనగర్ నివాసి. భరత్ డిప్లొమాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే అతడికి ఆకాశంలో వివిధ గ్రహాలను పరిశీలించడం అంటే చాలా ఇష్టం. అయితే ఇందుకోసం టెలిస్కోప్‌ను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదు. దీంతో స్వయంగా టెలిస్కోప్ తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. అనేక పుస్తకాలు చదివి తానే సొంతంగా ఈ పరికరాన్ని తయారు చేశాడు. ఈ టెలిస్కోప్‌తో ఇంటి నుంచే సౌరవ్యవస్థనుపరిశీలిస్తున్నట్లు భరత్ చెబుతున్నాడు.
పీ.ఎన్ శంకర్ అనే రచయిత రాసిన 'హౌ టు బిల్డ్ ఏ టెలిస్కోప్' పుస్తకాన్ని చదివి, అనేక మంది సలహాలతో తొలి ప్రయత్నంలోనే టెలిస్కోప్‌ను తయారు చేసినట్టు భరత్ తెలిపాడు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయాన్ని ఉపయోగించుకొని ఇందుకోసం పరిశోధనలు చేసినట్లు తెలిపాడు. ఈ టెలిస్కోప్‌ను కేవలం 50 గంటల్లోనే తయారు చేశానని అన్నాడు. 8 అంగుళాల వ్యాసంగల అద్దం, 8.1 ఫోకల్ రేషియో, 1660 మి.మీ ఫోకల్ లెంగ్త్‌తో కూడిన ఈ టెలిస్కోప్‌ను.. లోకల్ మెటీరియల్‌ను ఉపయోగించి కేవలం రూ. 20 వేలతో తయారుచేసినట్టు భరత్ పేర్కొన్నాడు. సాధారణంగా ఈ రకం టెలిస్కోప్ మార్కెట్లో రూ. 70- 80 వేల వరకు ధర పలుకుతుందని చెప్పాడు.